Junior NTR- Amit Shah: ఊరికే కలవరు మహానుభావులు అని.. దేశంలోనే పవర్ ఫుల్ పెద్దమనిషి హైదరాబాద్ వచ్చి ఒక తెలుగు హీరోను కలిశాడంటే దాని వెనుక అర్థం పరమర్థం రెండూ ఉంటాయి. పైకి ‘ఆర్ఆర్ఆర్’లో వీర లెవల్ లో నటించాడని.. జూనియర్ ఎన్టీఆర్ నటనకు ఫిదా అయ్యి ఆయనతో లంచ్ భేటికి అమిత్ షా పిలిచాడని చెబుతున్నా.. హైదరాబాద్ లో జరుగుతున్న ఈ మీటింగ్ కు చాలా ప్రాధాన్యం ఉంది. ఎందుకంటే ఇప్పుడు బీజేపీకి కావాల్సింది నడిపించే నాయకుడు. ఆ కొరతను తీర్చేందుకే అమిత్ షా ఇలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాడని సమాచారం.
తమిళనాట కూడా బీజేపీకి ఊపు తెచ్చేందుకు రజినీకాంత్ ను బీజేపీలో చేర్చుకొని పగ్గాలు అప్పగించాలని మోడీ శతవిధాల చూశాడు. రజినీ ఇంటికి చాలా సార్లు వెళ్లి మరీ లాబీయింగ్ చేశాడు. కానీ రజినీకాంత్ ఆరోగ్యం పాడవడం.. పైగా బీజేపీ అంటే తమిళులల్లో ఉన్న వ్యతిరేకతతో రజినీ ఆ పార్టీలో చేరలేదు. చివరకు అనారోగ్యంతో రాజకీయ సన్యాసమే చేశాడు.. దీంతో తమిళనాట ఇప్పుడు బీజేపీ మరో అగ్ర హీరో కోసం ప్రయత్నాలు చేస్తోంది.
Also Read: Eenadu: సండే స్పెషల్: ఇప్పటికీ ఆ పత్రికే నెంబర్ వన్.. ఇది ఎలా సాధ్యం?
దేశ రాజకీయాల్లో ముఖ్యంగా దక్షిణాదిలో హీరోలే రాజకీయాలను శాసించారు. ఓ ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత, చిరంజీవి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ లు పాపులర్ అయ్యారు. అందుకే తమిళనాడులో లాగానే ఏపీలోనూ బీజేపీ తమకు నడిపించే నాయకుడి కోసం శూలశోధన చేస్తోంది. ఏపీలో బీజేపీ బలం సున్నా.. అక్కడ పార్టీని లేపాలంటే మంచి గట్స్ ఉండి.. ప్రజల్లో పాపులారిటీ ఉన్న వ్యక్తి అవసరం. సోము వీర్రాజు సహా ఎంత మంది ఉన్నా కూడా అది సరిపోవడం లేదు. ఇక పవన్ కళ్యాణ్ తో చెలిమి చేస్తున్నా ఆయన బీజేపీలో విలీనం కావడం లేదు. సొంతంగానే ముందుకెళుతున్నారు.
అందుకే ఏపీ బీజేపీకి చుక్కాని లాంటి వ్యక్తి కోసం బీజేపీ చూస్తోంది. చంద్రబాబు పని అయిపోవడం.. జగన్ లాంటి యువ నేతకు పోటీ ఇవ్వాలంటే గట్టి అభ్యర్థి బీజేపీకి అవసరం. అందుకే జూనియర్ ఎన్టీఆర్ కు గాలం వేస్తున్నట్టు తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ లో నటన కు అభినందన కోసం జూ.ఎన్టీఆర్ ను లంచ్ భేటికి హైదరాబాద్ లో పిలిచాడు అమిత్ షా. కానీ వీరిద్దరి భేటి వెనుక ఏపీ రాజకీయాలను షేక్ చేసే చర్చ జరుగబోతోందన్నది ఇన్ సైడ్ టాక్.
జూ.ఎన్టీఆర్ ఇప్పట్లో తెలుగుదేశం పార్టీని లీడ్ చేసే అవకాశాలు లేవు. చంద్రబాబు శాశ్వతంగా వృద్ధాప్యంతో తప్పుకున్నా ఆయన కుమారుడు లోకేష్ కే పగ్గాలు ఇస్తాడు. జూనియర్ ఎన్టీఆర్ కు పగ్గాలు దక్కవు. దక్కించుకుందామంటే అది పెద్ద ప్రాసెస్ అవుతుంది. మరో వెన్నుపోటు రాజకీయాలు తప్పవు.
అందుకే ఏపీలో రాజకీయ నేపథ్యం ఉండి సినిమాల్లో అగ్రహీరోగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ను బీజేపీలోకి లాగాలని.. ఆయన ఒప్పుకుంటే ఏపీ బీజేపీ పగ్గాలు అప్పగించాలని బీజేపీ స్కెచ్ గీస్తున్నట్టు తెలిసింది. తాజాగా హైదరాబాద్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటి కానున్న జూనియర్ ఎన్టీఆర్ తో ఇదే చర్చిస్తారని..ఆయన ఒప్పుకుంటే ఏపీ బీజేపీ బాధ్యతలు ఇచ్చేస్తారన్నది ఇన్ సైడ్ టాక్. మరి ఈ భేటి తర్వాతనే అసలు క్లారిటీ బయటకు రానున్నది.
అయితే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు సినిమాల్లో పిచ్చ ఫాంలో ఉన్నాడు. ఇప్పటికిప్పుడు ఆయన కెరీర్ వదులుకొని రాజకీయాల్లోకి వచ్చే ఛాన్స్ లేదు. వస్తే గిస్తే తెలుగుదేశం ను టేకోవర్ చేయవచ్చు.కానీ బీజేపీని లీడ్ చేస్తారనుకోవడం పొరపాటే అని ఆయన సన్నిహితులు అంటున్నారు. మరి ఈ భేటి తర్వాత ఏం జరుగుతుందన్న ఉత్కంఠ మాత్రం అందరినీ ఊపేస్తోంది.
Also Read:Pawan Kalyan: పదవుల కోసం కాదు.. మార్పు కోసం ప్రాణాలిస్తానంటున్న పవన్..