Kirthi Shetty: ఉప్పెన చిత్రం తో వెండితెర అరంగేట్రం చేసి, తొలిసినిమాతోనే భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకొని యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని ఏర్పాటు చేసుకున్న హీరోయిన్ కృతి శెట్టి(Kirthi Shetty). ఈ సినిమా తర్వాత ఆమెకు టాలీవుడ్ లో వరుసగా అవకాశాలు క్యూలు కట్టాయి. స్టార్ హీరోలతో ఇప్పటి వరకు ఈమె సినిమాలు చేయలేదు కానీ, దాదాపుగా మీడియం రేంజ్ హీరోలందరితో సినిమాలు చేసింది. కానీ తెలుగు లో ఈమె చేసిన సినిమాల్లో అత్యధిక శాతం డిజాస్టర్ ఫ్లాప్ అయినవే ఎక్కువ ఉన్నాయి. ఉప్పెన తర్వాత ఈమె హీరోయిన్ గా నటించిన ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రం పెద్ద హిట్ అయ్యింది. ఆ తర్వాత విడుదలైన ‘బంగార్రాజు’ కూడా హిట్ అయ్యింది. ఇక ఆ తర్వాత ఈమె చేసిన ప్రతీ తెలుగు సినిమా కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్స్ అవుతూ వచ్చాయి.
దీంతో ఈమె టాలీవుడ్ కంటే ఎక్కువగా కోలీవుడ్ పైనే ద్రుష్టి పెట్టింది. అక్కడ వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ గా గడుపుతోంది. ఇప్పటికే ప్రదీప్ రంగనాథన్ తో ఈమె ‘LIK’ అనే చిత్రం లో నటించింది. ఈ చిత్రం తో పాటు కార్తీ తో కలిసి ‘వా..వాతియార్’ అనే చిత్రం లో నటించింది. తెలుగు లో ఈ సినిమా ‘అన్నగారు వస్తున్నారు’ అనే పేరుతో ఈ నెల 12 న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఆమె ప్రొమోషన్స్ లో పాల్గొంటుంది. అందులో భాగంగా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో రిపోర్టర్ తో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఆమె మాట్లాడుతూ ‘నేను అందరిలాంటి అమ్మాయిని కాదు, నా మనసు చాలా సున్నితం. మా అమ్మ నా తోడు లేకపోతే నేను అసలు ఇండస్ట్రీ లో ఉండేదానిని కాదు. చిన్న వయస్సులోనే నేను ఎన్నో సంఘటనలను ఎదురుకున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది.
ఇంకా ఆమె మాట్లాడుతూ ‘సోషల్ మీడియా లో నాపై వచ్చే ట్రోలింగ్స్, కొంతమంది నాపై చూపే ద్వేషాన్ని చూసి నాకు చాలా బాధ వేసేది. ఇక్కడ ఏదైనా మన చేతుల్లో ఉండదు, అయినా కూడా మన తప్పు లేకుండా మనల్ని నిందించినప్పుడు బాధ వేస్తుంది. ఆ సమయం లో నాకు మా అమ్మ అండగా నిలబడింది. నీ వల్ల అయినదానికంటే చాలా ఎక్కువ కష్టపడ్డావు అని ఎల్లప్పుడూ నాకు ధైర్యం చెప్పేది. నిజ జీవితం లో నాపై ఎవరైనా కామెట్స్ చేస్తే నేను పెద్దగా పట్టించుకోను. కానీ కెరీర్ పరంగా కామెంట్స్ చేస్తే తట్టుకోలేను. అమ్మతో పాటు నేను బాధ పడే సమయాల్లో నా స్నేహితులు కూడా నాతోనే ఉండేవారు. నన్ను సాధ్యమైనంత వరకు సొంతోషంగా ఉంచేందుకు ప్రయత్నం చేశారు’ అంటూ చెప్పుకొచ్చింది.