Somu Veerraju : సోము వీర్రాజుకు ఢిల్లీ పిలుపు.. వేగంగా మారుతున్న ఏపీ రాజకీయం

Somu Veerraju delhi : రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు జోరుగా మారుతున్నాయి. కొద్దిరోజుల కిందట జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లి బిజెపి అగ్ర నాయకులను కలిశారు. ఆ తర్వాత మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు. ఇప్పుడు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును అధిష్టానం ఢిల్లీకి పిలిపించింది. రాష్ట్రంలో బిజెపి కేంద్రంగా సాగుతున్న రాజకీయాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజును హైకమాండ్ ఢిల్లీకి పిలిపించింది. […]

Written By: BS, Updated On : April 8, 2023 10:51 pm
Follow us on

Somu Veerraju delhi : రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు జోరుగా మారుతున్నాయి. కొద్దిరోజుల కిందట జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లి బిజెపి అగ్ర నాయకులను కలిశారు. ఆ తర్వాత మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు. ఇప్పుడు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును అధిష్టానం ఢిల్లీకి పిలిపించింది. రాష్ట్రంలో బిజెపి కేంద్రంగా సాగుతున్న రాజకీయాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజును హైకమాండ్ ఢిల్లీకి పిలిపించింది. ఆకస్మాత్తుగా ఢిల్లీకి పిలిపించడం వెనుక కారణాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బిజెపిలో చేరిన సందర్భంగా సోము వీర్రాజుకు ఆహ్వానం అందలేదు. కానీ, ప్రత్యేకంగా ఇప్పుడు పిలిపించడంతో కారణం ఏమిటి..? అన్న దానిపై రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. కొద్దిరోజుల కిందట పవన్ కళ్యాణ్ బిజెపి అగ్ర నాయకులను కలిసి రాష్ట్ర నాయకత్వంపై ఫిర్యాదులు కూడా చేసినట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో సోము వీర్రాజు ఢిల్లీకి వెళ్లడం ఆసక్తికర పరిణామంగా భావిస్తున్నారు.

చేరికలపై సంప్రదింపులు ఉండే అవకాశం..

రాష్ట్రంలో బిజెపిని బలోపేతం చేయడంపై అధిష్టానం దృష్టి సారించింది. అందులో భాగంగానే బిజెపిలోకి పలు పార్టీలకు చెందిన కీలక నేతలను ఆహ్వానిస్తోంది. అందులో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీలో చేర్చుకున్నారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన మరి కొంత మంది పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు బిజెపి అగ్ర నాయకులు చెబుతున్నారు. రాయలసీమ ప్రాంతంలో ఎక్కువ మందిని చేర్చుకోవాలన్న ఉద్దేశంతో ఉన్న బిజెపి అధిష్టానం.. ఈ విషయంపై రాష్ట్ర అధ్యక్షుడు సోమ వీర్రాజుతో చర్చించేందుకు ఆయనను ఆకస్మాత్తుగా ఢిల్లీకి పిలిపించినట్లు చెబుతున్నారు. పార్టీలోకి వచ్చే నాయకులకు సముచిత స్థానాన్ని కల్పించడంతోపాటు వారికి పార్టీలో పదవులు ఇవ్వడం పైన సోము వీర్రాజుతో బిజెపి ముఖ్య నాయకులు చర్చించే అవకాశం కనిపిస్తోంది. అదే సమయంలో వచ్చే ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో అనుసరించాల్సిన వ్యూహాల గురించి చర్చించనున్నారు.

పొత్తులపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం..

ఇక ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలకు ఏడాది సమయం ఉన్నందున పొత్తులపైనా ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఢిల్లీలోని ముఖ్య నాయకులతో సమావేశం అనంతరం సోము వీర్రాజు పొత్తులపై ఒక కీలక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోందని చెబుతున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు మార్పుపైనా కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇది ఎంత వరకు అవకాశం ఉంటుందన్నది చెప్పలేమని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. సోము వీర్రాజు తాజా ఢిల్లీ పర్యటన వెనుక పార్టీలో చేరికలు, పొత్తు అంశాలే ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోందని ఆ పార్టీలోని ముఖ్య నాయకుడు ఒకరు చెబుతున్నారు. జనసేన పార్టీతో కలిసి వెళ్లడం వల్ల వచ్చే ఉపయోగం, జనసేన – టిడిపితో కలిసి వెళ్తే ఎటువంటి ప్రయోజనం ఉంటుంది వంటి విషయాలపై ఢిల్లీ కేంద్రంగా సోము వీర్రాజుతో కీలక చర్చలు జరిగే అవకాశం కనిపిస్తోంది.

టిడిపితో పొత్తుకు సోము వీర్రాజు అంగీకరించేనా..?

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉంటారన్న ముద్ర ఉంది. వైసీపీకి సానుభూతిపరుడు అన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో టిడిపి తో పొత్తుకు సంబంధించి అధిష్టానం ప్రతిపాదన చేస్తే.. దానిని సోము వీర్రాజు అంగీకరిస్తారా..? అన్నది పెద్ద ప్రశ్నగా కనిపిస్తోంది. జనసేనతో మాత్రమే కలిసి వెళ్లేందుకు సోము వీర్రాజు అంగీకరించే పరిస్థితి ఉంది. అయితే రాష్ట్రంలో వైసీపీతో కలిసి వెళ్లే అవకాశం లేనందున.. శాసనసభలో గానీ, శాసనమండలిలో గాని బిజెపికి ప్రాతినిధ్యం కావాలంటే జనసేన – టిడిపితో కలిపి ఏర్పడే కూటమిలో బిజెపి చేరాల్సిన అవసరం ఉందని పలువురు చెబుతున్నారు. అయితే దీనికి వీర్రాజు ఎంత వరకు అంగీకరిస్తారన్నది పెద్ద ప్రశ్నగా ఉంది. కాదు.. కూడదు అని ఒంటరిగా పోటీ చేయడం వలన బిజెపికి సీట్లు గెలిచే అంత స్థాయిలో రాష్ట్రంలో బలం లేదు. కాబట్టి, అధిష్టానం ఒత్తిడి చేస్తే మాత్రం సోము వీర్రాజు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంటుంది. చూడాలి ఢిల్లీ కేంద్రంగా సాగుతున్న రాష్ట్ర బిజెపి రాజకీయాలు ఎటువైపు మలుపు తీసుకుంటాయో.