తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ మరణం తర్వాత చంద్రబాబు చెప్పిందే వేదం. ఆయన నిర్ణయమే ఫైనల్. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఏ సమస్య వచ్చినా చంద్రబాబే రియాక్ట్ అవుతూ ఉంటారు. ఏ ప్రాంతీయ పార్టీలోనైనా అధినేతతో పాటు ఒకరిద్దరు నేతలైనా కీ రోల్ ప్లే చేస్తుంటారు. కానీ.. టీడీపీలో అలా కాదు. బాబు ఎవరినీ నమ్మే రకం కాదు. జాతీయ స్థాయి అధ్యక్షుడైనా పంచాయతీ సమస్యలపై గొంతెత్తుతారు. జగన్ మాదిరి ఇతర నాయకులపై వదిలిపెట్టరు. ఇదంతా మొన్నటివరకు ముచ్చట.
Also Read: ఆంధ్రజ్యోతి ఖాతాలో మరో లీగల్ నోటీస్
అలాంటి చంద్రబాబు తాను ఒక్కరే కాకుండా 219 మందితో జంబో జెట్ కార్యవర్గాన్ని నియమించి అచ్చెన్నకు కానుకగా ఇచ్చేశారు. ఇంతమందిని నియమించి అచ్చెన్నాయుడికి పెద్ద టాస్క్ పెట్టారు. ఆ కార్యకర్వగంలో అందరూ నాయకులే.. అందరూ లీడర్లే. ఎవరు ఎవరినీ లెక్క చేసే పరిస్థితి ఉండదు. ప్రతి ఒక్కరూ చంద్రబాబు దయతో పదవులు దక్కాయనే అంటుంటారు. అందుకే.. వారికి ఏ చిన్న సమస్య వచ్చినా బాబు దగ్గరకే పరుగుపెడుతుంటారు. అలాంటప్పుడు పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నా పెద్దగా ఒరిగేది ఏమీ ఉండదు. ఈ బాధలు, అవమానాలన్నీ ఒకప్పుడు కళా వెంకటరావు అనుభవించారు. ఇప్పుడు అచ్చెన్నాయుడు వంతు వచ్చిందని అంటున్నారు రాజకీయ నిపుణులు.
అచ్చెన్నాయుడిది శ్రీకాకుళం జిల్లా. తన సొంత జిల్లాలోనూ ఆయన మాట వినని లీడర్లు ఉన్నారు. గౌతు శ్యామసుందర శివాజీ వారసురాలు శిరీష రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తాజాగా నియమితులయ్యారు. ఆమెది ఒక గ్రూప్. అలాగే కళా వెంకటరావు పొలిట్ బ్యూరో మెంబర్‌గా ఉన్నారు. ఆయనకు అచ్చెన్నకు మధ్య విభేధాలు అందరికీ తెలిసిందే. మరి ఇలాంటి వేళ అందరినీ కలుపుకుని అచ్చెన్నాయుడు సొంత జిల్లాలోనే ఎలా ముందుకు వెళ్లగలరు..? అలాంటిది ఏపీలోని 13 జిల్లాలను ఆయన ఏక తాటి మీదకు ఎలా తీసుకురాగలరు..?
Also Read: ఆ సామాజిక వర్గానికే చంద్రబాబు ప్రాధాన్యం
ఇక విశాఖలో అచ్చెన్నాయుడు ప్రెసిడెంట్ హోదాలో తాజాగా టూర్ వేస్తే ఇద్దరు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. చాలా కాలంగా గంటా శ్రీనివాసరావు పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. మరో నేత, ఎమ్మెల్యే గణబాబు సైతం సైలెంట్‌గా ఉంటున్నారు. వీరెవరూ కొత్త ప్రెసిడెంట్‌ను కలవలేదు. మరి ఉత్తరాంధ్రాకు గుండెకాయ లాంటి విశాఖలో పార్టీని ఒడ్డున పడేసేందుకు అచ్చెన్నాయుడు దగ్గర ఉన్న మంత్రం ఏంటన్నది చూడాలి. ఆయనకు, గంటాకు గతంలోనే విభేదాలు ఉన్నాయని చెబుతారు. దాంతో అచ్చెన్నాయుడు ఇలాంటి గొడవలను కొత్తగా కెలుక్కోరు. మరి ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ చేసే పనులేంటి అంటే ప్రెస్ మీట్లు, ప్రెస్ నోట్లేనా అన్న సెటైర్లు కూడా పడుతున్నాయి. మొత్తానికి అచ్చెన్నాయుడి అధ్యక్ష పదవి మాత్రం స్టీరింగ్ లేని కారులాంటిదేననే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్