Kantara sequel movie : 20 కోట్ల బడ్జెట్.. కన్నడ కు తప్ప ఇతర భాషలకు తెలియని నటీనటులు… ఓ మామూలు కథ. అయితేనేం కేజీఎఫ్_2 రికార్డులను బ్రేక్ చేసింది. ట్రెండ్ సెట్ చేసింది. రిషబ్ శెట్టి, సప్తమి గౌడ ను ఎక్కడికో తీసుకెళ్ళింది. సినిమా నిర్మించిన హోంబాలే మూవీస్ కు దిమ్మతిరిగే వసూళ్లను అందించింది. ఇది ఇప్పటి దాకా జరిగింది.. త్వరలో దీనికి సీక్వెల్ రాబోతోంది. భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు.. బహుశా వచ్చే ఏడాదిలో విడుదల కావచ్చు.. ఇందుకు సంబంధించి రిషబ్ శెట్టి ప్రయత్నాలు ప్రారంభించాడు..కానీ నిజ జీవితంలో కాంతార తాలూకు కొన్ని అనుభవాలు కూడా విస్తు పోయేలా చేస్తున్నాయి..

సాధారణంగా మన నిజ జీవితంలో అసాధ్యమైన విషయాలను చెప్పేటప్పుడు దేవుడే దిగి రావాలి అనే పదాన్ని వాడతాం. కానీ కాంతార విషయంలో దేవుడే దిగి వచ్చాడు.. ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ సమయంలో ఆ అడవుల్లో ఒకసారి తనకు పంజుర్లి దైవానుగ్రహం లభించిందనీ, ఆ వ్యక్తిగత అనుభవాన్ని నేను అందరితోని పంచు కోలేనని రిషబ్ శెట్టి పలు సందర్భాల్లో అన్నాడు. సినిమా ప్రమోషన్ కోసం ఇలాంటివి మాట్లాడతారని చాలామంది అనుకున్నారు.. ఈ సినిమా థియేటర్ రన్ కూడా ముగిసిన తర్వాత ఎక్కడో ఓ గుడిలో కాంతార కథలో తరహాలోనే గుడి ట్రస్ట్ నియమాన్ని, నిర్ణయాన్ని ధిక్కరించిన ఓ గుడి పెద్దమనిషి కోర్టుకు ఎక్కాడు.. వెంటనే గుండెపోటుతో మరణించాడు. ఈ మరణాన్ని ఆ ప్రాంతవాసులు దేవుడు వేసిన శిక్షగా అభివర్ణిస్తున్నారు.
ఆ మధ్య కాంతార సీక్వెల్ తీసేందుకు ఆశీస్సులు కోరుతూ ఓ గుడిలో జరుగుతున్న భూతకోలకు రిషబ్ శెట్టి హాజరయ్యాడు. పంజుర్లీ దేవుడి దీవెనలు పొందాడు. ఈసారి మొత్తం హోం బలే ఫిలిమ్స్ టీం మరోచోట సాగుతున్న భూతకోలకు హాజరైంది. మంగళూరు ప్రాంతంలోని అన్నప్ప పంజుర్లి నెమోత్సవకు హాజరైంది.. అచ్చం కాంతార సినిమా చివరిలో భూతకోల ఆడే కథానాయకుడు ఈ అధికారులు, పెద్దలను దగ్గరికి పిలిచి, అందరి చేతులూ తన ఛాతిపై వేసుకొని ఆశీస్సులు ఇస్తున్న సీన్ అందరికీ గుర్తు ఉంది కదా! అచ్చం హోం బాలే టీమ్ ను కూడా సదరు భూత కోల కళాకారుడు అలాగే ఆశీర్వదించాడు.. తన ఆహార్యంలో భాగంగా అలంకరించుకున్న వక్క పూలను బహుకరించాడు.. దీంతో హోం బలే టీం తెగ ఆనందపడిపోయింది..ఇదంతా సాక్షాత్తు పంజుర్లి దేవుడి ఆశీస్సులుగా అభివర్ణించింది. ఈ వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసుకుంది..ఇప్పుడు ఇది వైరల్ గా మారింది.