Sandeep Reddy Vanga and Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇక నుండి తానూ చేయబోయే సినిమాల పట్ల అత్యంత జాగ్రత్తగా వ్యవహరించబోతున్నాడని టాక్. మొహమాటం కొద్దీ సినిమాలను ఒప్పుకోవడం ఇక నుండి ఆపేయాలని కఠినంగా నిర్ణయం తీసుకున్నాడట. #RRR కి ముందు ‘వినయ విధేయ రామ’. #RRR తర్వాత ‘ఆచార్య’, ‘గేమ్ చేంజర్’ చిత్రాలు రామ్ చరణ్ ఇమేజ్ కి చాలా డ్యామేజ్ చేసాయి. మరోపక్క తనతో సరిసమానమైన స్టార్ స్టేటస్ ఉన్న ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్ వంటి వారు క్రేజీ కాంబినేషన్స్ ని సెట్ చేసుకుంటూ, చాలా జాగ్రత్తగా ముందుకు పోతుంటే, రామ్ చరణ్ మాత్రం పాత కమర్షియల్ సినిమా ఫార్మటు లో వెళ్తూ తన మార్కెట్ ని చెడగొట్టుకుంటున్నాడని అభిమానుల్లో ఆందోళన మొదలైంది. అందుకే ఇక నుండి న్యూ ఏజ్ కాన్సెప్ట్స్ మాత్రమే ఎంచుకోవాలని, కథ నచ్చకపోతే ఎంత పెద్ద డైరెక్టర్ కి అయినా నో చెప్పాలని అనుకుంటున్నాడట.
ప్రస్తుతం ఆయన బుచ్చి బాబు తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘పెద్ది’ అనే టైటిల్ పెట్టేందుకు పరిశీలిస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ గుడ్డివాడిగా కనిపించబోతున్నాడని టాక్. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే సుకుమార్ తో సినిమా ప్రారంభించబోతున్నాడు. ఈ చిత్రాల తర్వాత చేయబోయే సినిమా కూడా ఫిక్స్ అయిపోయింది. నిన్న ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ రామ్ చరణ్ ని కలిసి ఒక స్టోరీ లైన్ వినిపించాడట. ఇది రామ్ చరణ్ కి చాలా నచ్చిందని టాక్. స్క్రిప్ట్ సిద్ధం చేయాల్సిందిగా చెప్పాడట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అధికారిక ప్రకటన గ్రాండ్ గా చేయనున్నారు మేకర్స్. వచ్చే ఏడాది చివర్లో ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం సందీప్ ప్రభాస్ తో ‘స్పిరిట్’ అనే మూవీ చేయబోతున్నాడు. ఈ వేసవి నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఈ చిత్రం తర్వాత ఆయన అల్లు అర్జున్ మూవీ కి షిఫ్ట్ అవుతాడని అందరూ అనుకున్నారు కానీ, ఆ ప్రాజెక్ట్ కంటే ముందు రామ్ చరణ్ తో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. సందీప్ వంగ మార్క్ హీరోయిజంలో రామ్ చరణ్ ని ఊహిస్తేనే గూస్ బంప్స్ వస్తున్నాయని, ఇలాంటి కాంబినేషన్ కోసమే ఇన్ని రోజులు మేము ఎదురు చూసాము అంటూ అభిమానులు సోషల్ మీడియా లో ఈ సందర్భంగా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేవలం సందీప్ వంగ తో మాత్రమే కాదు, భవిష్యత్తులో రామ్ చరణ్ ప్రశాంత్ నీల్, లోకేష్ కనకరాజ్ వంటి టాప్ మోస్ట్ సౌత్ ఇండియన్ డైరెక్టర్స్ తో కూడా పని చేయబోతున్నాడు. ఇవన్నీ కేవలం ఆయన కాంబినేషన్స్ కోసం చెయ్యట్లేదు, కథలు నచ్చాయి కాబట్టే చేస్తున్నాడట. ఈ సినిమాలతో బౌన్స్ బ్యాక్ అయ్యి పాన్ ఇండియా లెవెల్ లో తన సత్తా చాటడానికి సిద్ధం అవుతున్నాడు రామ్ చరణ్.