Fish Venkat: టాలీవుడ్ లో క్యారక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్ గా ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఫిష్ వెంకట్, ఈమధ్య కాలంలో సినిమాలు బాగా తగ్గించేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఫుల్ బిజీ గా ఉండే ఫిష్ వెంకట్ అకస్మాత్తుగా సినిమాల్లో కనిపించకపోవడానికి కారణం ఏమిటి అని ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ ఆయన ఇంటికి వెళ్లి ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూ లో ఫిష్ వెంకట్ తాను అనుభవిస్తున్న కష్టాల గురించి చెప్పుకుంటూ కన్నీటి పర్యంతం అయ్యాడు. తన రెండు కిడ్నీలు చెడిపోవడం తో డయాలిసిస్ చేయించుకున్నానని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చాడు. ఇంకా ఆయన మాట్లాడుతూ నాకు షుగర్, బీపీ ఉండడం వల్ల నా కళ్ళకు తగిలిన చిన్న దెబ్బ పెరిగి పెద్దదైందని, కాళ్ళ మీదున్న తోలు మొత్తం లేచిపోతుందని, ప్రైవేట్ హాస్పిటల్ లో ఆపరేషన్ చేయించుకోడానికి నా ఆర్ధిక స్తొమత సహకరించకపోవడంతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్నానని, ఈ కారణం చేతనే సినిమాల్లో అవకాశాలు వస్తున్నప్పటికీ కూడా షూటింగ్ కి వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పుకొచ్చాడు ఫిష్ వెంకట్.
ఆయన ఇచ్చిన ఈ ఇంటర్వ్యూ తెగ వైరల్ గా మారింది, సినీ పరిశ్రమకి చెందిన పెద్ద వాళ్ళందరూ ఈ విషయం తెలుసుకొని ఫోన్లు చేస్తున్నారు. నాకు ఆర్ధిక సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. చిరంజీవి, రామ్ చరణ్ గార్లు కూడా ఫోన్ చేసి నా పరిస్థితిని ఆరా తీశారు. ఇండస్ట్రీ లో నేను ఎవరినైనా సహాయం అడిగితే చెయ్యకుండా ఉండరు, ఎంత డబ్బులైన ఇస్తారు. కానీ ఒకరి ముందు డబ్బుల కోసం చెయ్యి చాచడం నాకు ఇష్టం లేదు, అందుకే నా పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నప్పటికీ కూడా నేను ఎవరికీ చెప్పలేదు. కానీ ఇప్పుడు ఇండస్ట్రీ నుండి నాన్ స్టాప్ గా కాల్స్ వస్తూనే ఉన్నాయి. నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కావడం లేదు, జీవితం లో డబ్బుల కోసం ఎవరి ముందు దేహీ అని అడిగే పరిస్థితి రాకూడదు అనుకున్నాను, అలాంటి నాకు ఇప్పుడు అలాంటి పరిస్థితి వచ్చింది, ఇదేమి కర్మ అంటూ ఫిష్ వెంకట్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
ఫిష్ వెంకట్ వీవీ వినాయక్ సినిమాల ద్వారా బాగా పాపులర్ అయ్యాడు. ఆయన తెరకెక్కించే ప్రతీ సినిమాలో ఫిష్ వెంకట్ నటించేవాడు. ఆది చిత్రంలో తొడగొట్టు చిన్నా అనే డైలాగ్ అప్పట్లో ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమా తర్వాత వరుసగా ఆయన రౌడీ గ్యాంగ్ లో నటించేవాడు. డిఫరెంట్ డైలాగ్ డెలివరీ తో ప్రేక్షకులకు నవ్వు రప్పించే ఫిష్ వెంకట్ ‘గబ్బర్ సింగ్’ చిత్రం ద్వారా మరింత పాపులర్ అయ్యాడు. అలా ఎన్నో విధాలుగా మనల్ని అలరించిన ఫిష్ వెంకట్ తొందరగా కోలుకొని సినిమాల్లోకి మళ్ళీ యాక్టీవ్ అవ్వాలని ఆశిద్దాం.