
దేశంలో ప్రతీ రంగం కరోనా బారి నుంచి బయటపడింది.. ఒక్క సినిమా రంగం తప్ప! అవును.. తొలిద సుదీర్ఘ కొవిడ్ నుంచి బయటపడిన తర్వాత కేవలం మూడు నెలలు మాత్రమే థియేటర్లు తెరుచుకుని, మళ్లీ మూతపడ్డాయి. ఈ మధ్యనే మరోసారి ఓపెన్ అయ్యాయి. అయితే.. ఏపీ సర్కారు నుంచి మాత్రం తగిన ప్రోత్సాహం లభించట్లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తొలిదశలో నామమాత్రంగా కరెంటు బిల్లులు మాఫీ చేసిన జగన్ సర్కారు.. ఆ తర్వాత పట్టించుకోవట్లదని సినీవర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
వకీల్ సాబ్ సినిమా సమయంలో ఉన్నట్టుండి రేట్లు తగ్గించింది జగన్ ప్రభుత్వం. ఎప్పుడో దశాబ్ద కాలం క్రితం రేట్లను ఇప్పుడు అమలు చేయాలంటూ హడావిడిగా జీవో జారీచేసిన సంగతి తెలిసిందే. ఇదంతా రాజకీయంగా పవన్ ను దెబ్బతీసేందుకే అనే విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే.. ఇప్పుడు అన్ని సినిమాలకూ ఇదే పరిస్థితి వచ్చి పడుతోంది. ఈ రేట్ల సమస్యే కాకుండా.. ఇంకా అననుకూల పరిస్థితులు చాలా ఉన్నాయి ఏపీలో.
ఆంధ్రప్రదేశ్ లో 50 శాతం ఆక్యుపెన్సీ మాత్రమే ఇప్పటికీ అమల్లో ఉంది. దాంతోపాటు నైట్ షోలు కూడా రద్దు చేసింది ప్రభుత్వం. ఈ విధంగా ఏపీలో సినీ రంగానికి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే.. తెలంగాణలో మాత్రం పూర్తి సానుకూల వాతావరణం ఉంది. ఇక్కడ వందశాతం ఆక్యుపెన్సీ ఉంది. కరోనా నేపథ్యంలో జరిగిన నష్టానికి గానూ.. థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలు చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించింది.
అంతేకాదు.. తాజాగా మంగళవారం సినీ ప్రముఖులతో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అదనపు షోలకు అనుమతులు ఇవ్వడంతోపాటు, విద్యుత్ బిల్లులు మాఫీ చేయడం వంటి కోరికల పట్ల మంత్రి సానుకూలంగా స్పందించినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇది ఖచ్చితంగా ఎగ్జిబిటర్లకు ఊరట కలిగించే అంశమే.
ఈ విధంగా తెలంగాణ సర్కారు సినీ పరిశ్రమకు మద్దతుగా నిలుస్తున్నప్పటికీ.. ఏపీలోని జగన్ ప్రభుత్వం మాత్రం పట్టుదలగా వ్యవహరిస్తోందని అంటున్నారు. టికెట్ రేట్ల విషయంలో మొండిగా ఉండడాన్ని ఇండస్ట్రీ పెద్దలు ఉదహరిస్తున్నారు. పక్క రాష్ట్రం అందిస్తున్న సహకారాన్ని చూసైనా.. జగన్ సర్కారు తీరు మార్చుకోవాలని కోరుతున్నారు. మరి, ఏం జరుగుతుందన్నది చూడాలి.