Choreographer Chaitanya Master: పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసిన సంఘటన నిన్న చోటు చేసుకుంది. ఢీ షో కొరియోగ్రాఫర్ మాస్టర్ చైతన్య ఆత్మహత్య చేసుకున్నారు. నెల్లూరులో ఓ హోటల్ లో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మహ్యతకు ముందు ఆయన ఒక సెల్ఫీ వీడియో రికార్డు చేశాడు. ఆత్మహత్యకు కారణాలు వెల్లడించారు. ప్రధానంగా ఆర్థిక ఇబ్బందులే అని చైతన్య చెప్పారు. చేసిన అప్పులు తీర్చలేక ఒత్తిడి ఎక్కువై ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలియజేశాడు. ఢీ షో నేమ్, ఫేమ్ ఇచ్చింది. కానీ ఆర్థికంగా నిలబెట్టలేకపోయింది. జబర్దస్త్ తో పోల్చుకుంటే ఢీ షోలో తక్కువ పేమెంట్స్ ఉన్నాయన్న విషయాన్ని చైతన్య సూసైడ్ వీడియోలో ప్రస్తావించారు.
చైతన్య మరణం పరిశ్రమలోని దుర్భర పరిస్థితులను తెరపైకి తెచ్చింది. బుల్లితెర మీద కలర్ఫుల్ గా కనిపించే ఆర్టిస్ట్స్ తెర వెనుక జీవితాలు చీకటిమయమని తెలుస్తుంది. చైతన్య సాధారణ డాన్సర్ కూడా కాదు. ఆయన మాస్టర్. జడ్జి స్థాయి హోదా ఆ షోలో అనుభవించారు. ఏళ్ల తరబడి పరిశ్రమలో ఉన్నాడు. కొందరితో పోల్చుకుంటే సక్సెస్ఫుల్ కొరియోగ్రాఫర్. చిన్నా చితకా చిత్రాలకు పని చేశారు కూడాను. అలాంటి చైతన్యకు కనీస సంపాదన లేదు. అవసరాల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి.
ఒక సక్సెస్ ఫుల్ కొరియోగ్రాఫర్ పరిస్థితే ఇంత దుర్భరంగా ఉంటే… ఢీ షోలో చేసే డాన్సర్స్ పోజీషన్ ఏమిటీ? వాళ్ళ కనీస అవసరాలైనా తీరుతున్నాయా? అనే సందేహాలు కలుగుతున్నాయి. డాన్స్ చేయడం సాధారణ విషయం కాదు. టాలెంట్ తో పాటు ఎనర్జీ కావాలి. ప్రాక్టీస్, పెర్ఫార్మన్స్ సమయంలో ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. చాలా రిస్కీ జాబ్. గాల్లో ఎగిరి ఫీట్లు చేసేటప్పుడు పట్టుతప్పితే ప్రాణాలు కూడా పోయే ఛాన్స్ ఉంటుంది.
తమ ప్రాణాలు పణంగా పెట్టి చేస్తున్న డాన్సర్స్ కి నిర్మాతలు కనీస రెమ్యూనరేషన్ ఇవ్వడం లేదు. చైతన్య శ్రమకు, టాలెంట్ కి ఆయన వలన షోకి వచ్చిన ఆదరణకు సమానమైన రెమ్యూనరేషన్ ఇచ్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది. చైతన్య ఆత్మహత్యకు మల్లెమాల సంస్థ పరోక్షంగా కారణమైంది. గతంలో నాగబాబు ఇదే విషయాన్ని ప్రస్తావించారు. మల్లెమాల సంస్థ మీద అసహనం వ్యక్తం చేశారు. మంచి భోజనం పెట్టరు. తక్కువ రెమ్యూనరేషన్స్ ఇస్తూ ఆర్టిస్ట్స్ ని దోచుకుంటున్నారని ఆరోపణలు చేశారు. ఆయన చేసిన కామెంట్స్ ఎంత నిజమో చైతన్య మరణంతో తేలిపోయింది.
ప్రాణాలు తీసుకోబోయే ముందు కూడా చైతన్య మల్లెమాల మీద ఆరోపణలు చేయలేదు. తన ఆర్థిక ఇబ్బందులు కారణంగానే చనిపోతున్నాను అన్నారు. కాకపోతే మల్లెమాల తక్కువ పే చేస్తుంది. దాని వలన సంపాదన లేదన్నారు. చైతన్య లాంటి వాళ్ళు ఎంటర్టైన్మెంట్ రంగంలో వందల మంది ఉన్నారు. వెండితెర, బుల్లితెర మీద వాళ్ళను చూసి అద్భుతమైన జీవితాలు, లక్షల సంపాదన అని భ్రమపడుతూ ఉంటాము. రియాలిటీలో ఇరుకు గదుల్లో మూడు పూటల భోజనం లేకుండా మగ్గిపోతుంటారు. రంగం ఒకటే ఒకడేమో కోట్లు సంపాదిస్తూ కారుల్లో తిరుగుతూ ఉంటే, ఇంకొకడేమో కూటికి కూడా గతిలేక ఇబ్బందిపడుతుంటాడు. అందుకే సినిమాను మాయా ప్రపంచం అంటారు.