హుజురాబాద్ లో రాజకీయ సమీకరణలు రోజురోజుకు మారుతున్నాయి. అధికార పార్టీ టీఆర్ఎస్ తన వ్యూహాలను అమలు చేస్తూ ప్రత్యర్థి పార్టీలను చిత్తు చేసేందుకు కుట్రలు పన్నుతోంది. ఇప్పటికే బీజేపీ నుంచి పలువురిని చేర్చుకుంటూ వారిలో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ప్రోత్సహిస్తోంది. ఈ నేపథ్యంలో పలు మార్పులు చోటుచేసుకుంటున్నాయి. బీజేపీ నేతలను తమ పార్టీలోకి రావాలని వలలు వేస్తోంది. దీంతో బీజేపీ గెలుపును దెబ్బ తీయాలని భావిస్తున్నా అధికార పార్టీ ఆగడాలు మాత్రం అందరిని ఆందోళనకు గురిచేస్తున్నాయి.
మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి టీఆర్ఎస్ పార్టీల చేరేందుకు నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. అధినేత కేసీఆర్ సమక్షంలో కారెక్కేందుకు నిర్ణయించుకున్నారు. శుక్రవారం సాయంత్రం పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. దీంతో బీజేపీలో నేతలందరు ఇలా వెళుతుంటే ఎలా అని అందరు ఆశ్చర్యపోతున్నారు. ఈటల రాజేందర్ బీజేపీలో చేరడంతో పెద్దిరెడ్డి కినుక వహించారు. నియోజకవర్గంలో తన ప్రాబల్యం తగ్గుతుందని భావించి ఆయన పార్టీ మారేందుకు నిశ్చయించుకుని గులాబీ పార్టీలో చేరుతున్నారు.
ఈటల చేరికతో తన విలువ తగ్గిందని భావించిన పెద్దిరెడ్డి నాటి నుంచే పార్టీ మారేందుకు ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా టీఆర్ఎస్ తో టచ్ లో ఉంటూ చివరికి అందులోనే చేరిపోయారు. దీంతో నియోజకవర్గంలో అందరు వీడిపోవడంతో బీజేపీలో కూడా నేతల్లో భయం పుట్టుకొస్తోంది. ఎలాగైనా అధికార పార్టీని ఢీకొట్టాలనే భావనతో ఉన్న బీజేపీని ఆలోచనలో పడేసే విధంగా టీఆర్ఎస్ కుట్రలు చేస్తోందని తెలుస్తోంది.
అయితే హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిపై ఇప్పటికైతే స్పష్పత లేదు ఎవరికి టికెట్ కేటాయిస్తారో అనే సందేహాలు అందరిలో వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే ఐదారుగురు తమకే టికెట్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసినా కేసీఆర్ వ్యూహం వేరే ఉంటుందని భావిస్తున్నారు. ఈటలను ఢీకొట్టే సత్తా గల నేత కోసమే ఇన్నాళ్లు వేచి చూస్తున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా హుజురాబాద్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.