Srinija: ఇటీవలే జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రమాణ స్వీకారం రోజున శ్రీనిజ అనే నటి మోహన్‌బాబుపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలోనే ఆమెను మా శాశ్వత సభ్యత్వం నుంచి నివధికంగా సస్పెండ్ చేశారు. ఈ మేరకు అక్టోబరు 23న మా ఈసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మా ప్రతిష్టకు భంగం కలిగించేలా ప్రవర్తించారంటూ శ్రీనిజకు అక్టోబరు16న ఈసీ షోకాజ్ నోటీసు పంపించింది. మీడియాలో వచ్చిన వార్తలను ఉటంకిస్తూ.. షోకాజ్ నోటీసులను పంపించారు.

మూడు రోజుల్లో ఈ విషయంపై వివరణ ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని ఈసీ హెచ్చరించింది. అయితే, షోకాజ్ నోటీసుకు ఆమె ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేకపోవడంతో ఈసీ, ఆమెపై వేటు వేసింది. మంచు విష్ణు గెలుపు తర్వాత శాశ్వత సభ్యురాలిపై ఈ తరహా చర్యలు తీసుకోవడం ఇదే తొలిసారి.
ప్రమాణ స్వీకారోత్సవ సమయంలో మోహన్ బాబు, నరేష్‌లపై శ్రీనిజ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత కొన్ని యూట్యూబ్ ఛానెళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో తాను ఏ పరిస్థితులలో అలా మాట్లాడాల్సి వచ్చిందో వివరించారు. సాధారణంగా ఎవరైనా సభ్యులు ఈ తరహా వ్యాఖ్యలు చేసినప్పుడు వారిని పిలిచి.. మందలించడం అనేది ఒక సంప్రదాయంగా వస్తోంది. కానీ శ్రీనిజ విషయంలో ఇంత తీవ్రమైన చర్య తీసుకోవడం పట్ల కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.