Akshaye Khanna: ఈ ఏడాది డిసెంబర్ 4న విడుదలైన ‘దురంధర్'(Dhurandhar Movie) చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన సునామీ ఎలాంటిదో అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. ఈ చిత్రం లో హీరో గా నటించిన రణవీర్ సింగ్(Ranveer Singh) కి ఎంత మంచి పేరొచ్చిందో, విలన్ గా నటించిన అక్షయ్ ఖన్నా(Akshay Khanna) కి కూడా అంతే మంచి పేరొచ్చింది. అత్యధిక శాతం మంది అయితే, ఈ సినిమా అంత పెద్ద హిట్ అవ్వడానికి ముఖ్య కారణం అక్షయ్ ఖన్నా అనే అంటారు. ఆ రేంజ్ నటన కనబర్చాడు ఆయన. ఈ ఏడాది ప్రారంభం లో చావా చిత్రం లో ఔరంగజేబు పాత్రలో జీవించి భారీ బ్లాక్ బస్టర్ ని అందుకున్న అక్షయ్ ఖన్నా, ఏడాది చివర్లో కూడా మరోసారి తన విశ్వరూపం చూపించాడు. బాలీవుడ్ లో ఈ ఏడాది టాప్ 2 గ్రాసర్స్ గా నిల్చిన ఈ రెండు సినిమాల్లో అక్షయ్ ఖన్నా ప్రభావం చాలా గట్టిదే.
అలాంటి అక్షయ్ ఖన్నా ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు. విషయం లోకి వెళ్తే మలయాళం ‘దృశ్యం 3’ లో కీలక పాత్ర పోషించడానికి అక్షయ్ ఖన్నా ని ఎంచుకున్నారు మేకర్స్. అయితే అకస్మాత్తుగా ఇప్పుడు ఆయన ఈ సినిమా నుండి తప్పుకోవడంతో ఆ చిత్ర నిర్మాత కుమార్ మంగత్ పాఠక్ అక్షయ్ ఖన్నా పై కేసు వేసాడు. ఆయన మాట్లాడుతూ ‘గత రెండేళ్ల నుండి మేము దృశ్యం 3 స్క్రిప్ట్ కోసం కష్టపడుతున్నాం. ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. ఈ విషయం అక్షయ్ ఖన్నా కి కూడా తెలుసు. స్క్రిప్ట్ మొత్తం విన్న తర్వాత అతనికి బాగా నచ్చింది. రెమ్యూనరేషన్, డేట్స్ వగైరా అంశాలపై అన్నీ మాట్లాడుకున్న తర్వాతే సంతకాలు చేసుకున్నాం. ఆయన ఒప్పుకున్న వెంటనే అడ్వాన్స్ కూడా పంపాము. కానీ ఒక రోజు ఆయన ఈ సినిమా చేయడం లేదని మాకు మెసేజ్ చేసాడు’.
‘ఆ తర్వాత మేము అతన్ని సంప్రదించాలని చూసినా ఆయన మాకు అందుబాటులోకి రాలేదు. ఇప్పటికీ అతన్ని సంప్రదించడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. తదుపరి చర్యలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు అక్షయ్ ఖన్నా ఈ సినిమా నుండి తప్పుకోవడం తో, షూటింగ్ పై ఎలాంటి ప్రభావం పడకూడదు అనే ఉద్దేశ్యం తో ఆయన స్థానం లోకి జైదీప్ ఆహ్లావత్ ని ఎంచుకున్నారు. అయితే అక్షయ్ ఖన్నా ఈ సినిమా నుండి తప్పుకోవడానికి ప్రధాన కారణం రెమ్యూనరేషన్. ‘దురంధర్’ తర్వాత ఆయన రేంజ్ ఎవ్వరూ ఊహించని స్థాయికి వెళ్ళింది. ఇప్పుడు ఒక్కో సినిమాకు ఆయన 20 కోట్లు డిమాండ్ చేస్తున్నాడు. కొన్ని సినిమాలకు ఆయన సంతకాలు కూడా చేసేసాడు. ‘దృశ్యం 3’ ఆయన గతం లో కేవలం రెండు కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ కి మాత్రమే కమిట్ అయ్యాడు, కానీ ఇప్పుడు ఆయన రేంజ్ 20 కోట్లకు ఎగబాకింది. అలాంటప్పుడు అనవసరంగా రెండు కోట్ల కోసం సమయం వృధా చేయడం ఇష్టం లేకనే ఆయన ఈ చిత్రం నుండి తప్పుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.