Sajjanar: తెలుగు రాష్ట్రాల్లో ఐ బొమ్మ వెబ్ సైట్ నిర్వాహకుడు రవి గురించి ఒకటే చర్చ. అతడు అరెస్టు అయిన నాటి నుంచి మీడియాలో విపరీతంగా వార్తలు వస్తున్నాయి. అతడి నేపథ్యం గురించి సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. రవి ఏం చేసేవాడు? అతడు ఏం చదువుకున్నాడు? అతడి నేపథ్యం ఏంటి? ఎంత సంపాదించాడు? అతడి ఖాతాలో ఎన్ని డబ్బులు ఉన్నాయి? విదేశాల నుంచి అకస్మాత్తుగా ఇండియాకు ఎందుకు వచ్చాడు? ఇలా అనేక విధాలుగా మీడియాలో, సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
ఐ బొమ్మ రవి వల్ల తెలుగు చిత్ర పరిశ్రమకు విపరీతంగా నష్టం జరుగుతోంది. అతడు ప్రొఫెషనల్ హ్యాకర్. వివిధ రూపాలలో హ్యాకింగ్ చేసి సినిమాలను డౌన్లోడ్ చేసి.. తన వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతున్నాడు. ఈ సినిమాలను చూసేవారి సంఖ్య పెరిగిపోవడంతో అతడి సైట్ కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఇదే క్రమంలో అతడు సంపాదన కోసం బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్ చేయడం మొదలుపెట్టాడు. తద్వారా భారీగా ఆర్జించడం ప్రారంభించాడు. ఎప్పుడైతే అతడు పోలీసులకు సవాల్ విసిరాడో.. దానిని వారు సీరియస్ గా తీసుకున్నారు.. అంతేకాదు అతడి ఆను పానులు తెలుసుకున్నారు. అతడు ఇండియాకు వచ్చిన తర్వాత అరెస్ట్ చేశారు.
రవి అరెస్టు వ్యవహారం మీడియాలో విపరీతమైన చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో అతనికి అనుకూలంగా చాలామంది మీమ్స్ రూపొందిస్తున్నారు. వీడియోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇవి కమిషనర్ సజ్జనార్ దృష్టికి వచ్చాయి. దీంతో ఆయన ఒక్కసారిగా సీరియస్ అయ్యారు. ” రవిని అనవసరంగా హీరోని చేయకండి. ఆయన చేసిన పనిని కీర్తిస్తూ సోషల్ మీడియాలో వీడియోలు పెట్టకండి. ఆ తదుపరి మీరే ఇబ్బంది పడతారు. చట్ట వ్యతిరేక వ్యక్తులకు సపోర్ట్ చేసి ఇబ్బందులు కొని తెచ్చుకోకండి అంటూ” సజ్జనార్ హెచ్చరికలు జారీ చేశారు. రవి అరెస్టు అయిన తర్వాత సోషల్ మీడియాలో అతనికి అనుకూలంగా చాలా మంది ప్రచారం చేస్తున్నారు. వారిని దృష్టిలో పెట్టుకొని సజ్జనార్ ఈ ప్రకటన చేసినట్టు తెలుస్తోంది. సజ్జనార్ ప్రకటన చేసిన తర్వాత సోషల్ మీడియాలో ఆ తరహా వీడియోలు ఆగిపోయాయి. ఒక అసాంఘిక శక్తికి ప్రజలు సపోర్ట్ చేయడానికి పోలీస్ శాఖ తీవ్రంగా పరిగణించిందని.. అందువల్లే ఇలాంటి హెచ్చరికలు జారీ చేస్తోందని సమాచారం.