Unstoppable With Nbk- Prabhas: ప్రభాస్ కొత్త సినిమాకు మించిన హైప్ ఆయన పాల్గొన్న అన్ స్టాపబుల్ ఎపిసోడ్స్ కి వచ్చింది. అరుదుగా బయట కనిపించే ప్రభాస్ బోల్డ్ టాక్ షోకి వస్తున్నాడు అనగానే అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ప్రోమోలతో బజ్ మరింత పెంచారు. ఆహా యాజమాన్యం ప్రభాస్ ఎపిసోడ్ ని క్యాష్ చేసుకోవాలని కలలు కంది. పెద్ద మొత్తంలో సబ్స్క్రైబర్స్ రాబట్టాలని ప్రణాళికలు వేసింది. మరి పూర్తి స్థాయిలో డార్లింగ్ ప్రభాస్ ని ఆహా ఉపయోగించుకుందా అంటే డౌటే. ప్రోమోలలో చూపించిన మజా ఎపిసోడ్స్ లో మిస్ అయ్యింది. ప్రభాస్ జీవితంలో ప్రశ్నగా మారిన పెళ్లి, తెరపైకి వచ్చిన పుకార్లపై మాత్రమే దృష్టి పెట్టి సెన్సిటివ్ అండ్ ఎమోషనల్ కంటెంట్ రాబట్టడంలో ఫెయిల్ అయ్యారు.

ఆదిలోనే హంసపాదు అన్నట్లు… ప్రభాస్ ఎపిసోడ్ ప్రసారానికి ఆహా పూర్తి స్థాయిలో సిద్ధం కాలేదు. ఒకపక్క భారీగా హైప్ వచ్చిందని తెలుసు. లక్షల్లో సబ్స్క్రైబర్స్ యాప్ లోకి లాగిన్ అయితే సప్పోర్ట్ చేయగలదా అనే కనీస విషయాన్ని పట్టించుకోలేదు. డిసెంబర్ 29 రాత్రి 9 గంటలకు ఎపిసోడ్ అనగానే జనాలు పోటెత్తారు. ఓవర్ లోడ్ కారణంగా సర్వర్స్ బిజీ అయ్యాయి. గంటల తరబడి యాప్ పని పని చేయలేదు. పెద్ద మొత్తంలో ఎపిసోడ్ జనాలు చూసే అరుదైన అవకాశం ఆహా కోల్పోయింది. బాహుబలి ఎపిసోడ్ ఫస్ట్ ఫెయిల్యూర్ గా దీన్ని చెప్పొచ్చు.
ప్రభాస్ పెళ్లి ఎందుకు చేసుకోవడం లేదు? ఆయన జీవితంలో ఎవరైనా ఉన్నారా? అనుష్క శెట్టి, కృతి సనన్ లతో ఎఫైర్ వార్తలకు ప్రభాస్ ఏం సమాధానం చెబుతాడు? అనేది ప్రేక్షకులు ఎదురు చూసిన ప్రశ్నలు. అవన్నీ బాలయ్య అడిగారు. వీటికి ప్రభాస్ సమాధానాలు ఏమంత కిక్ ఇవ్వలేదు. ఓ హీరోయిన్ తో నాకు ఎఫైర్ ఉందని చెప్పడానికి ఆయనేమీ బాలీవుడ్ హీరో కాదు. బాలయ్య షో అయినా భగవంతుడు షో అయినా కొన్ని ప్రశ్నలకు డిప్లొమాటిక్ సమాధానాలే ఉంటాయి.
ఇక పెళ్లి గురించి అడిగితే సిల్లీ సమాధానాలు చెప్పాడు. రాత బాగోలేదని, సల్మాన్ పెళ్లి తర్వాత నాది అని తేల్చిపారేశారు. ప్రభాస్ సమాధానాలు ఎంతో కొంత మేర ఎంటర్టైన్ చేశాయి. అయితే స్పష్టమైన క్లారిటీ ఇవ్వలేదు. రెండు ఎపిసోడ్స్ గా షోని విభజించినప్పుడు అంశాల వారీగా షో ప్లాన్ చేస్తే బాగుండేది. టాక్ షోలలో కాంట్రవర్సీకి మించి ఎమోషనల్ కంటెంట్ వర్క్ అవుట్ అవుద్ది. ఆలీతో సరదాగా షో మనం గమనిస్తే ఈ విషయం బాగా అర్థం అవుతుంది. అలాంటి ఎమోషన్స్ ప్రభాస్ నుండి బాలయ్య రాబట్టలేకపోయారు.

పెదనాన్న మరణం గురించి అడిగినప్పుడు మాత్రం ఆ ఎమోషనల్ యాంగిల్ కొంత మేర వర్కవుట్ అయ్యింది. గంభీరంగా ఉండే ప్రభాస్ కన్నీరు పెట్టుకోవడం మనసులను తాకింది. మిత్రుడు గోపీచంద్ తో ప్రభాస్ అనుబంధాన్ని గట్టిగా టచ్ చేస్తే బాగుండేది. గోపీచంద్ జాయిన్ అయ్యాక కూడా హీరోయిన్స్, అఫైర్స్, వాళ్ళ కోసం కొట్లాట అంటూ అదే కిచిడి ప్రశ్నలు అడిగారు. ప్రోమోల వరకూ ఓకే కానీ… విషయం లేని సమాధానాలతో అవి షోని నిలబెట్టలేవు.
మొత్తంగా ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ బిజీ షెడ్యూల్స్ పక్కన పెట్టి… దాదాపు ఒక రోజంతా ఆహా కోసం కేటాయించి షో చేస్తే… ఆయన తాగ్యాన్ని కంప్లీట్ గా వాడుకోలేకపోయారు. ప్రణాళిక లోపించి యావరేజ్ గా ముగించారు. ఇది పూర్తిగా డైరెక్టర్ బి వి ఎస్ రవి వైఫల్యమే. హోస్ట్ బాలయ్యను నిందించడానికి లేదు. కనీసం పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ విషయంలో అయినా ఈ లోపాలు సరి చేసుకుంటే ఫలితం దక్కుతుంది.