Manchu Vishnu- Akkineni Akhil: సినిమా పరిశ్రమలో వారసత్వం చాలా కామన్. ముఖ్యంగా స్టార్ హీరోలు తమ పిల్లలు కూడా సిల్వర్ స్క్రీన్ పై తిరుగులేని హీరోలుగా ఎదగాలి అనుకుంటారు. వారసత్వం పోనివ్వడకుండా రాణించాలి ముందు తరాలకి తీసుకెళ్లాలి అనుకుంటారు. అభిమానులు సైతం ఇదే కోరుకుంటారు. అభిమాన హీరో కొడుకు రూపు రేఖలు, టాలెంట్ విషయంలో కొంచెం అటూ ఇటూ ఉన్నా సప్పోర్ట్ చేస్తారు. అందుకే వారసుల సక్సెస్ రేటు ఎక్కువగానే ఉంటుంది. మరి ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ కాబట్టి, డెబ్యూ మూవీ హిట్ అయితే కెరీర్ ఘనంగా ఉంటుంది. సక్సెస్ కి ఛాన్స్ ఉంటుందని స్టార్స్ నమ్ముతారు.

ఖర్చుకు వెనుకాడకుండా ఎక్కడా రాజీ పడకుండా నిర్మిస్తారు. అలా భారీగా వెండితెరకు పరిచయమైన వారసుల్లో మంచు విష్ణు, అఖిల్ కూడా ఉన్నారు. వీరిద్దరి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి కారణం వీరి లాంచింగ్ చిత్రాల్లో పోలికలు ఉన్నాయి. బడ్జెట్, టైటిల్, రిజల్ట్ విషయంలో సారూప్యతలు ఉన్నాయి. అవేమిటో చూద్దాం…
2003లో పెద్ద కుమారుడు మంచు విష్ణును మోహన్ బాబు నటవారసుడిగా దించాడు. ఆహార్యం, పోలికల్లో అచ్చు మోహన్ బాబులా మంచు విష్ణు తలపించాడు. డెబ్యూ మూవీ కోసం మలయాళ స్టార్ డైరెక్టర్ షాజీ కైలాస్ ని ఎంచుకున్నారు.హీరోయిన్ గా సాక్షి శివానంద్ చెల్లెలు అహనా శివానంద్ ని తీసుకున్నారు. బ్రహ్మానందం, సాయి కుమార్, జయసుధ, మురళీ మోహన్, రాజీవ్ కనకాల వంటి స్టార్ క్యాస్ట్ నటించారు. వరుస ఇంటర్వ్యూలు, లెక్కలు మించిన ప్రమోషన్స్… విష్ణు కోసం డబ్బులు నీళ్లలా ఖర్చు చేశాడు. ‘విష్ణు’ మూవీ బడ్జెట్ వింటే మీరు మూర్చపోతారు. దాదాపు రూ. 28 కోట్లతో తెరకెక్కించారు. 20 ఏళ్ల క్రితం అంత బడ్జెట్ అంటే ఇప్పుడు ఓ రెండు వందల కోట్లు అనుకోవచ్చు. మంచు విష్ణు ప్రజెంట్ మార్కెట్ అందులో సగం లేదు.

విష్ణు పేరునే టైటిల్ గా పెట్టి తెరకెక్కించిన ‘విష్ణు’ మూవీ 2003 అక్టోబర్ 3న గ్రాండ్ గా విడుదలైంది. టాక్ మాత్రం డిజాస్టర్. కోట్ల రూపాయలు బూడిదలో పోసిన పన్నీరు అయ్యాయి. ఇక అక్కినేని అఖిల్ వారసుడు కథ కూడా సేమ్. 2015లో నాగార్జున తన రెండో కొడుకు అఖిల్ ని లాంచ్ చేశాడు. వివి వినాయక్ దర్శకత్వంలో సయేశా హీరోయిన్ గా ‘అఖిల్’ మూవీ తెరకెక్కించారు. ‘అఖిల్’ మూవీ బడ్జెట్ దాదాపు రూ. 35 నుండి 40 కోట్లు. ఓ ఎస్టాబ్లిష్డ్ టైర్ టూ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ వసూళ్లకు సమానం అది.
అరంగేట్రంతోనే కొడుకును మాస్ హీరో చేయాలనే తపనతో నాగార్జున ఏమాత్రం సంకోచించకుండా భారీ బడ్జెట్ తో అఖిల్ చిత్రం నిర్మించారు. రిజల్ట్ మాత్రం షాక్ ఇచ్చింది. అఖిల్ మూవీ నాగార్జునకు, వివి వినాయక్ తో పాటు అఖిల్ కి చేదు అనుభవం మిగిల్చింది. మంచు విష్ణు, అఖిల్… తమ సొంత పేర్లను టైటిల్స్ గా పెట్టుకొని భారీ బడ్జెట్ తో లాంచింగ్ మూవీస్ చేస్తే డిజాస్టర్ రిజల్ట్స్ వచ్చాయి.