Sr NTR First Film Remuneration : తెలుగు తెరకు మకుటం లేని మహరాజు నందమూరి తారక రామారావు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడే కాదు. తెలుగు ప్రజల ఆత్మాభిమానాన్ని విశ్వవ్యాపితం చేసిన మహా నాయకుడు కూడా. నటుడిగా, రాజకీయ నేతగా ఉన్నత శిఖరాలను అధిరోహించిన మహోన్నత వ్యక్తిత్వం ఆయన సొంతం. ఎన్టీఆర్ ప్రవేశంతో తెలుగు సినిమా చరిత్ర గతి మారింది. ఆయన పొలిటికల్ ఎంట్రీ తెలుగు నేల గతిని మార్చింది. సినీ రంగంలో ఆయన చేయని పాత్ర లేదు. పౌరాణిక, జానపదాల స్పెషలిస్ట్ ఆయన, రాముడైనా, కృష్ణుడైనా ఆ పాత్రకు ప్రాణం పోసింది ఆయనే. సమాజహితం కోసం తన ఇమేజ్ ను సైతం పక్కన పెట్టి పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి మెప్పించారు ఆయన. ఆయన తొలిచిత్ర మనదేశం. 1949 నవంబరు 24న విడుదలైంది ఈ చిత్రం.
ఎల్వీ ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ పోలీసు పాత్రలో కనిపించారు. ‘విప్రదాస్’ అనే బెంగాలీ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రసిద్ధ నటులు చిత్తూరు నాగయ్య, కృష్ణవేణి, రేలంగి తదితరులు ఇందులో నటించారు. తెలుగువారి ఆరాధ్య దైవంగా మారిన ఎన్టీఆర్ నటించిన ఈ చిత్రం స్వాతంత్ర్యం రాక ముందు ప్రారంభమైనా.. స్వాతంత్ర్యం వచ్చాక విడులైంది.ఇంకో విషయం ఏమిటంటే సంగీత దర్శకుడిగా ఘంటసాల వెంకటేశ్వరరావుకు కూడా ఇదే తొలి చిత్రం కావడం గమనార్హం. ఈ చిత్రం తరువాత బెంగాళి నవలల ఆధారంగా తెలుగు చిత్రాలు రూపుదిద్దుకున్నాయి. దేవదాసు, ఆరాధన వంటి చిత్రాలు ఈ పరంపరలోనే వచ్చాయి.
తన తొలి చిత్రం మనదేశంకు ఎన్టీఆర్ అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా? అక్షరాలా రూ.250లు. ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో భాగంగా రూపొందించిన ఎన్టీఆర్ సావనీర్ లో ఈ విషయాన్ని వెల్లడించారు. ఒక చిత్రానికి పదులకోట్ల రూపాయల్లో పారితాషికోన్ని నేటి హీరోలు తీసుకుంటున్నారు. అటువంటిది రూ.250ల పారితోషికంతో సినీ కెరీర్ ను ప్రారంభించిన ఎన్టీఆర్ వెండితెరను మకుటం లేని మహరాజుగా ఏలారు. ముఖ్యంగా పౌరాణి, జానపద చిత్రాల గతిని మార్చగలిగారు. తెలుగు ప్రజల ఆరాధ్య దైవంగా మారారు.అచంద్రార్కం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.