Adipurush Pre Release Event: ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీ ఎత్తున నిర్వహించారు. సినిమాకు దేవుడు, హిందూ సెంటిమెంట్ జోడించారు. అందుకే డివోషనల్ సిటీ తిరుమలను ఎంచుకున్నారు. లక్షల్లో అభిమానులు ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి జనాలు హాజరయ్యారు. ఆదిపురుష్ ప్రాంగణం మొత్తం కాషాయమయమైంది. జెండాలు పట్టుకొని, టీషర్ట్స్ ధరించి జై శ్రీరామ్ నినాదాలు చేశారు. హిందువాదులు, ప్రభాస్ ఫ్యాన్స్ ఒక్కచోట చేరినట్లు ఆ ఈవెంట్ చూస్తే అర్థమవుతుంది. ఇక వేదికపై ఓం రౌత్ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కి పాల్పడ్డారు.
రామాయణ గాథ ప్రదర్శించే ప్రతీచోటకు హనుమంతుడు వస్తాడని మా అమ్మ చెప్పింది. కాబట్టి నిర్మాతలకు నా రిక్వెస్ట్ ఏమిటంటే… ఆదిపురుష్ ప్రదర్శించే ప్రతి థియేటర్లో ఒక సీటు ఖాళీగా హనుమంతుడు కోసం ఉంచాలని అన్నారు. వినడానికి కొంచెం వింతగా ఉన్నా, ఇది హిందువులను థియేటర్స్ కి నడిపించే ప్రయత్నం కావచ్చు. ఇదిలా ఉంటే ఆదిపురుష్ ఈవెంట్ కోసం నిర్మాతలు ఏకంగా రూ. 2.5 కోట్లు ఖర్చు చేశారట. కేవలం బాణా సంచా కోసం రూ. 50 లక్షలు కేటాయించారట.
ప్రభాస్ వేదిక వద్దకు వచ్చే సమయంలో పెద్ద ఎత్తున బాణా సంచా పేల్చారు. కేవలం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కోట్లలో ఖర్చు చేయడం గతంలో ఎన్నడూ చూడనిది. అయితే ఇదంతా పెట్టుబడిగానే భావించాలి. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించి దేశం మొత్తం సినిమా గురించి చెప్పుకునేలా చేయాలి. హైప్ క్రియేట్ చేయాలి. అప్పుడు టాక్ తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ దక్కుతాయి. సినిమా బాగుంటే అవి పెరుగుతూ పోతాయి. నెగిటివ్ టాక్ వస్తే ఓపెనింగ్స్ తో కొంతలో కొంత బయటపడొచ్చు.
జూన్ 16న వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో ఆదిపురుష్ మూవీ విడుదల చేస్తున్నారు. ప్రభాస్ రాఘవుడిగా నటిస్తున్నారు. కృతి సనన్ జానకి పాత్ర చేస్తుంది. లంకేశ్వరుడు పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. ఆదిపురుష్ చిత్రానికి అజయ్-అతుల్ మ్యూజిక్ అందించారు. టీ సిరీస్, యూవీ క్రియేషన్ నిర్మించాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ. 150 కోట్లకు పైగా థియేటరికల్ హక్కులు విక్రయించినట్లు సమాచారం. ఆదిపురుష్ భారీగా బిజినెస్ చేసిన నేపథ్యంలో హిట్ అవ్వాలంటే బ్లాక్ బస్టర్ టాక్ రావాలి.