Director SS Rajamouli: వెండితెరను చుట్టేసి రంగుల భావోద్వేగాల హరివిల్లును చూపించిన దార్శనికుడు రాజమౌళి, లోకాలు చుట్టేసి.. ఊహ జగత్తు గమ్మత్తులు ఆవిష్కరించిన దర్శక మాంత్రికుడు రాజమౌళి, సినీ లోకంలో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసిన నేటి కాలజ్ఞాని రాజమౌళి, నేటి సాంకేతికతకు కొత్త పద్ధతులు నేర్పిన అధునాతన వినూత్న సహవాసి రాజమౌళి, నవ్యతను శ్వాసించి, వైవిధ్యాలను ఆవిష్కరించిన వెండితెర దరహాసం రాజమౌళి.
అన్నిటికీ మించి అపజయం తెలియని విజయాల మగధీరుడు రాజమౌళి. మరి ‘రాజమౌళి’ విజయాల వెనుక కారణం ఏమై ఉంటుంది ? మాస్ ప్రేక్షకులు మెచ్చే రోమాంచిత దృశ్యాలను దట్టించి, జనరంజక చిత్రాలను తియ్యటంలో ప్రస్తుతం భారత చలనచిత్ర పరిశ్రమలో రాజమౌళి మించిన వారు లేరు. ఆ టాలెంట్ ఒక్క రాజమౌళికే ఎలా సాధ్యం అయ్యింది ?
Also Read: ‘రాధేశ్యామ్’ పరిస్థితి దారుణం.. ఎన్ని కోట్లు లాస్ అంటే.. ?
పెద్దగా కథ లేకుండానే కేవలం వీరోచిత కథనం, గగుర్పాటు కలిగించే సీన్లను కూర్చి హిట్ కొట్టడం ఒక్క రాజమౌళికే ఎలా కుదురుతుంది ? నిజానికి సింహాద్రి నుంచే రాజమౌళి శైలి ఇలాగే ఉంది. ప్రతి సినిమాలో అబ్బుర పరిచే సన్నివేశాలను పెట్టి గొప్ప విజయాలను అందుకుంటున్నాడు. సింహాద్రి విరామానికి ముందు వచ్చే పోరాటఘట్టం, ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే తిరుగుబాటు దృశ్యం కారణంగానే ఆ సినిమా అంత గొప్ప హిట్ అయ్యింది.
విక్రమార్కుడులో హాస్య రసం వెగటుగా ఉన్నా.. రౌద్ర రసంతో మిగతా లోపాలన్నీ కప్పేసాడు. తిరుగుబాటు పోరాటాల్లోని ఇంటెన్సిటీ లేకుండా చత్రపతి చిత్రాన్ని ఊహించుకోవడం కూడా కష్టమే. అయినా ఆ సినిమాలో మదర్ సెంటిమెంట్ తో గుండెలను పిండేశాడు. ఇక మగధీరలో వందమందితో పోరాటం మొత్తం ఆ చిత్రాన్నే నిలబెట్టింది. ఇలా ప్రతి సినిమాలో బలమైన రెండు మూడు సన్నివేశాలతో ఆ సినిమా స్థాయినే మార్చేస్తున్నాడు రాజమౌళి.
అలాగని రాజమౌళికి హాస్యం చేతకాక కాదు, మర్యాద రామన్నతో అటు కూడా తన బలం ఏమిటో చూపించాడు. ఎప్పుడూ ఒకే భావావేశాలేనా ? అని జనం కామెంట్లు చేయకముందే ఈగ తీసి అందరీ నోర్లు మూయించాడు. ఇక బాహుబలి గురించి కొత్తగా ఏమి చెప్పక్కర్లేదు. ప్రభాస్ తల నరికే సన్నివేశం ఈ సినిమా మొత్తాన్నే మరో రేంజ్ కి తీసుకువెళ్ళింది.
అయితే, రాజమౌళి విజయాల వెనుక ఇంకా చాలా కారణాలే ఉన్నాయి. ముఖ్యంగా కీరవాణి బాణీలదీ ముఖ్యపాత్ర. అలాగే ఎప్పటికప్పుడు ప్రేక్షకుల అభిరుచులను తృప్తిపరిచే సరుకు సరఫరా చేయడం మరో ముఖ్య కారణం. ఇక స్థిరంగా విజయాలు అందుకోవాలనే తపన మరో పెద్ద కారణం. తన సినిమాల్లో ఎబ్బెట్టు దృశ్యాలున్నా.. వాటిని మరిపించే పోరాట ఘట్టాలను సమర్ధవంతంగా పెడతాడు జక్కన్న.
అలాగే, తన సినిమాలో చాలా కాపీ దృశ్యాలున్నా.. అవి కూడా భావోద్వేగాలతో ప్రేక్షకులను కట్టేస్తాయ్. కొన్ని చోట్ల సృజనాత్మకత అతి అనిపించినా.. విరామ మలుపు సీట్లోంచి కదలనీయకుండా చేస్తోంది. అందుకే.. రాజమౌళికి పరాజయం లేదు. నేటికి ఎన్నటికీ రాజమౌళి విజయాల రారాజుగానే కొనసాగాలని ఆశిద్దాం.
Also Read: దసరా నుంచి ‘స్పార్క్ ఆఫ్ దసరా’.. ఆకట్టుకున్న నాని !