Well Come To The Jangil: బాలీవుడ్ స్టార్ యాక్టర్ అక్షయ్ కుమార్ ప్రస్తుతం ‘వెల్‌కమ్ టు ది జంగిల్ (Well Come To The Jangil)’ లో నటిస్తున్నాడు. అయితే ఈ చిత్రానికి సంబంధించి అనౌన్స్‌మెంట్ వీడియో జియో స్టూడియోస్ అధికారిక యూ ట్యూబ్ ఛానెల్ నుంచి తొలగించడం చర్చనీయాంశమైంది. ఇప్పటికే వివాదాల్లో ఉన్న ఈ చిత్రం తాజా తొలగింపుతో మరిన్ని అనుమానాలు రేకెత్తిస్తోంది. జియో సినిమా ఆ క్లిప్ ను తొలగించడంతో ఈ చిత్రం షూటింగ్ ఆగిపోయిందా? అనే ప్రశ్నలకు దారితీసింది. దీనిపై నిర్మాతలు స్పందించారు. చిత్రం షూటింగ్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు. చిత్రం ఆగస్ట్ షెడ్యూల్ పూర్తయ్యింది. కశ్మీర్, ముంబై షెడ్యూల్ పూర్తయ్యింది. ఇక అక్టోబర్ లో అంతర్జాతీయ షెడ్యూల్ ప్రారంభమవుతుంది. ఈ చిత్రంపై ఇటీవల మీడియాలో వస్తున్న వార్తలను దర్శకుడు అహ్మద్ ఖాన్ ఖండించారు. ఈ పుకార్లలో ఎలాంటి నిజం లేదన్నారు. చిత్రం ట్రాక్‌లోనే ఉంది ప్రస్తుతం మా షెడ్యూల్ అక్టోబర్ నుంచి యధాతథంగా కొనసాగుతుంది. ఇప్పటికే మా సాంకేతిక బృందం అదే పనిలో ఉంది. చిత్ర యూనిట్ కూడా త్వరలోనే అక్కడికి చేరుకుంటుంది. సమయానుకూలంగా షెడ్యూల్ పూర్తవుతుంది. ఇందులో ఎలాంటి సందేహాలు అవసరం లేదు. కచ్చితంగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం. అపారమైన నిర్మాణ స్థాయి, సెట్, 34 మంది నటీనటులతో కూడిన తారాగణంతో ‘వెల్‌కమ్ టు ది జంగిల్’ ప్రేక్షకులకు వినోదం అందించనున్నది. ఇప్పటికే 70% చిత్రీకరణను పూర్తి చేశారు మేకర్స్.
ఈ చిత్రంలో అక్షయ్ కుమార్‌తో పాటు సునీల్ శెట్టి, అర్షద్ వార్సీ, పరేష్ రావల్, జానీ లివర్, రాజ్‌పాల్ యాదవ్, తుషార్ కపూర్, శ్రేయాస్ తల్పాడే, రవీనా టాండన్, లారా దత్తా, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, దిశా పటానీ నటిస్తున్నారు. అయితే నానా పటేకర్, అనిల్ కపూర్ ఈ సినిమాలో నటించడం లేదు. దీనిపై నానా పటేకర్ స్పందిస్తూ, “నేను అందులో భాగం కాదు, బహుశా వారు హమ్ బోహోత్ పురానే హో గయే హై (నేను పాతబడిపోయాను) అని అనుకోవచ్చు” అని అన్నారు. మూడో విడుత పార్ట్ ప్రకటన రాగానే అభిమానులు ఆనందంలో మునిగి తేలారు. అయితే డేట్స్ సర్దుబాటు చేయలేక సంజయ్ దత్ ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు.
‘బాలీవుడ్ హంగామా’ ఇందుకు సంబంధించిన ఒక కథనాన్ని ఉంచింది. ‘సంజయ్ దత్ ఈ సినిమాలో నటించకోవడానికి కారణం డేట్స్ లేకపోవడమే. ఈ విషయంలో తన ప్రియ స్నేహితుడు అక్షయ్‌కు అన్ని సమస్యలను చెప్పాడు. దీంతో అక్షయ్ కూడా ఓకే చెప్పేశాడు. ‘వెల్‌కమ్ టు ది జంగిల్’ షూట్ షెడ్యూల్ తో తనకు సాధ్యం కాదని సంజయ్ చెప్పాడు. అయితే సంజయ్ నటించిన 15 రోజుల షూటింగ్ పార్ట్ ను మళ్లీ రీ షూట్ చేయాలని యూనిట్ భావిస్తున్నది.
హేరా ఫేరి 3 తర్వాత, వెల్‌కమ్ 3 షూటింగ్ కూడా మధ్యలోనే ఆగిపోయిందని, ఆ ప్రకటన వీడియోను జియో స్టూడియోస్ తొలగించిందని గతంలో రెడ్డిట్ తన థ్రెడ్‌లో ఒక పోస్ట్‌ను షేర్ చేసింది. ‘వెల్‌కమ్ టు ది జంగిల్’ అనేది ఈ ఏడాది అత్యధికంగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి. చాలా ఏండ్ల తర్వాత అక్షయ్ కుమార్ కామెడీ రోల్ లో నటించడం, 30 మందికి పైగా నటీనటులతో కూడిన సీన్లు అదనపు ఆకర్షణ. ఈ కొత్త-యుగం బాలీవుడ్‌లో చాలా అరుదుగా ఉంటుంది.
మేకర్స్ ఈ చిత్రం యొక్క మొదటి షెడ్యూల్‌ను పూర్తి చేయగా, ఈ చిత్రం కొత్త విడుదల తేదీని చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. డిసెంబర్ 20, 2025న విడుదలకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, అనౌన్స్‌మెంట్ వీడియోను తీసివేయడం సినిమా సమస్యల్లో ఉన్నట్లు ఊహాగానాలకు దారితీసింది. అయితే, జియో స్టూడియో, చిత్ర బృందం నుంచి ఇంకా ధృవీకరణ రాలేదు.