
యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య బాలీవుడ్‌లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. మానసిక ఒత్తిడి కారణంగా సుశాంత్ బలవన్మరణం పాలవగా.. అందుకు కారణం అతనికి అవకాశాలు రాకుండా చేయడమే అన్న విమర్శలు వస్తున్నాయి. బాలీవుడ్ కొన్నికుటుంబాల గుప్పిట్లోనే ఉందని, వాళ్ల బంధువులకే అవకాశాలు ఇస్తూ.. ఇతరులను తొక్కేస్తున్నారని కంగనా రనౌత్ వంటి ప్రముఖులు బహిరంగంగానే వివర్శిస్తున్నారు. బంధుప్రీతి కారణంగా బలైన వారిలో సుశాంత్ ఒకరని అంటున్నారు. మరోవైపు సుశాంత్ మరణాన్ని అతని మిత్రులు, కలిసి పని చేసినవాళ్లు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఎప్పుడూ నవ్వుతూ ఉండే వ్యక్తి ఆత్మహత్య ను నమ్మలేకపోతున్నామని భావోద్వేగ పోస్ట్ లు పెడుతున్నారు. ఇంకోవైపు సుశాంత్ సూసైడ్ కేసుపై ముంబై పోలీసుల విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో సుశాంత్ చివరి చిత్రం ‘దిల్ బేచారా’లో హీరోయిన్‌గా నటించిన సంజన సంఘిని పోలీసులు విచారించారు. ఆమె స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. ఇందుకోసం తన స్వస్థలం ఢిల్లీ నుంచి ముంబై వచ్చిందామె. నిన్న తిరిగి వెళ్లింది. ఈ క్రమంలో ఢిల్లీ విమానం ఎక్కే క్రమంలో సంజన తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్టు సంచలనం రేపింది. ముంబైకి గుడ్‌బై చెబుతున్నా.. మళ్లీ వస్తానో రానో అని చెప్పడంతో ప్రాధానత్య సంతరించుకుంది.

‘బై ముంబై. నాలుగు నెలల నీ దర్శనం లభించింది. నేను ఢిల్లీకి తిరిగి వెళ్లిపోతున్నాను. ఇక్కడి వీధులన్నీ వింతగా, నిశ్శబ్దంగా, ఖాళీగా కనిపిస్తున్నాయి. బహుశా నా గుండెల్లో నిండుకున్న బాధతో నా దృష్టి కూడా మారిందేమో. లేదంటే నీలో కూడా ఏదైనా బాధ ఉందేమో. మనం మళ్లీ కలుస్తాం. లేదంటే కలవలేకపోవచ్చు కూడా’ అని ముంబై ఎయిర్పోర్టులో ఉండగా ఆమె పోస్ట్ చేసింది. సుశాంత్ కేసులో పోలీసులు దాదాపు పది గంటల పాటు విచారించడంతో భావోద్వేగానికి గురై ఆమె ఈ పోస్టు చేసిందని కొందరు అంటున్నారు. కాగా, తాను హీరోయిన్‌గా మొదటి చిత్రం ‘దిల్ బేచారా’ థియేటర్లో కాకుండా ఓటీటీ లో విడుదలవడం, సుశాంత్ మరణం వల్ల కూడా పరిశ్రమను వదిలేయాలని సంజన నిర్ణయం తీసుకుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.