Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ చిత్రం కమర్షియల్ గా డిజాస్టర్ ఫ్లాప్ అయినప్పటికీ ఒక సెక్షన్ ఆడియన్స్ కి మాత్రం బాగా నచ్చింది. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఆపన్న క్యారక్టర్ ని మెచ్చుకొని వాళ్లంటూ ఎవ్వరూ లేరు. ఈ పాత్రలో రామ్ చరణ్ నటించలేదు, జీవించాడు అనే చెప్పాలి. నత్తి క్యారక్టర్ లో ఎవరిని చూసినా ఓవర్ యాక్షన్ అనే అనిపిస్తుంది. కానీ రామ్ చరణ్ మాత్రం చాలా చక్కగా, సహజమైన నటనతో ప్రేక్షకులను కట్టిపారేశాడు. ఈ క్యారక్టర్ నిడివి కాస్త పెంచి ఉండుంటే, కమర్షియల్ గా మరో రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ అయ్యేదని చూసిన ప్రతీ ఒక్కరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రామ్ చరణ్ కి నేషనల్ అవార్డు కూడా వచ్చే పరిస్థితి ఉండేదని అంటున్నారు. అయితే ఈ క్యారక్టర్ ని ముందుగా రామ్ చరణ్ తో చేయాలని అనుకోలేదట.
కాస్త మధ్య వయస్సు ఉన్న క్యారక్టర్, అందులోనూ రాజకీయ నాయకుడి క్యారక్టర్ అవ్వడంతో సీనియర్ హీరో అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి తో ఈ పాత్ర చేయించాలని అనుకున్నాడట డైరెక్టర్ శంకర్. ఆ పాత్ర కి ఆయన మాత్రమే న్యాయం చేయగలడని అనుకున్నాడట. ఇదే ఆలోచనని రామ్ చరణ్ కి శంకర్ చెప్పగా, నాన్నతో అవసరం లేదండి, ఈ క్యారక్టర్ ని నేను చేయగలను, ఒక ఛాలెంజ్ గా తీసుకొని చేస్తానని చెప్పి, ఈ క్యారక్టర్ చేసాడు. వయస్సు కి మించిన పాత్ర అయినప్పటికీ కూడా, రామ్ చరణ్ ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి, జీవించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ట్రైలర్ లో అప్పన్న క్యారక్టర్ కి సంబంధించిన షాట్స్ ని చూసి, ఈ క్యారక్టర్ రామ్ చరణ్ కి సరిపడేలా లేదు, కచ్చితంగా ట్రోల్ స్టఫ్ అవుతుందని అనుకున్నారు. కానీ ఆ క్యారక్టర్ సినిమాకి హైలైట్ గా నిల్చింది.
ఈ పాత్ర ని వెండితెర మీద చూస్తున్నంత సేపు పవన్ కళ్యాణ్ అభిమానులు తమ అభిమాన హీరో సిద్ధాంతాలను వెండితెర పై చూస్తున్నట్టుగా అనిపించింది. ఈ క్యారక్టర్ కి సంబంధించిన నేపధ్య సంగీతం కానీ, స్క్రీన్ ప్లే కానీ, బ్యాక్ గ్రౌండ్ సెటప్ కానీ వింటేజ్ శంకర్ రేంజ్ ని తలపించాయి. మరి ఇదే వింటేజ్ యాంగిల్ ని ఆయన ఎందుకు సినిమా మొత్తం చూపించలేకపోయాడు అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. భవిష్యత్తులో అయినా శంకర్ ఇదే వింటేజ్ యాంగిల్ ని బయటకి తీసి సినిమాలు చేస్తాడా?, లేకపోతే అనేక మంది పవర్ ఫుల్ డైరెక్టర్స్ కెరీర్స్ కాలగర్భంలో కలిసిపోయినట్టే, ఈ కెరీర్ కూడా అందులో కలిసిపోబోతుందా అనేది చూడాలి. ప్రస్తుతం ఆయన కమల్ హాసన్ తో ఇండియన్ 3 చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా సక్సెస్ అవ్వడం ఆయన కెరీర్ కి ఎంతో ముఖ్యం. చూడాలి మరి ఏమి జరగబోతుందో.