Dharma Productions: కోవిడ్ వ్యాక్సిన్‌ను తయారు చేసే ప్రముఖ కంపెనీ సీరమ్ ఇనిస్టిట్యూట్ యజమాని అదార్ పూనావాలా మరోసారి వార్తల్లో నిలిచారు. సెరమ్ ఇనిస్టిట్యూట్ సీఈఓ అదార్ పూనావాలా ఇప్పుడు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్‌తో చేతులు కలిపారు. ధర్మ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో 50 శాతం వాటాను 1000 కోట్ల రూపాయలకు అదార్ పూనావాలా సంస్థ సెరీన్ ప్రొడక్షన్స్ కొనుగోలు చేయబోతున్నట్లు సమాచారం. ఎకనామిక్ పోర్టల్ మనీకంట్రోల్ నివేదిక ప్రకారం ఈ వార్త బయటకు వచ్చింది. ధర్మ ప్రొడక్షన్స్‌లో చిత్రనిర్మాత కరణ్ జోహార్ మిగిలిన 50 శాతం వాటాను కలిగి ఉంటారని, అతను కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఉంటారని పేర్కొంది. దీంతో పాటు కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా అపూర్వ మెహతా కొనసాగనున్నారు.
అదార్ పూనావాలా ఎవరు?
సెరమ్ ఇన్‌స్టిట్యూట్ ద్వారా భారతదేశంలో కోవిడ్ వ్యాక్సిన్‌ను తయారు చేయడంలో అదార్ పూనావాలా ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. కోవిడ్ సంక్షోభ సమయంలో దేశంలోని ప్రతి ఒక్కరికీ కోవిషీల్డ్ ద్వారా వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు అదార్ పూనావాలా అంటే ఎవరో అందరికీ తెలిసింది.
1997లో ధర్మ ప్రొడక్షన్స్ ప్రారంభం
ధర్మ ప్రొడక్షన్స్‌ను 1997లో యశ్ జోహార్ ప్రారంభించారు. అతని మరణం తర్వాత, అతని కుమారుడు కరణ్ జోహార్ 2004 సంవత్సరంలో కంపెనీ పగ్గాలు చేపట్టారు. ఈ చిత్ర నిర్మాణ సంస్థ కభీ ఖుషీ కభీ ఘమ్, మై నేమ్ ఈజ్ ఖాన్, కేసరి, సింబా, ధడక్, యే జవానీ హై దీవానీ, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ వంటి అనేక చిత్రాలను నిర్మించింది. వీటిలో చాలా బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి.
కరణ్ జోహార్ అదార్ పూనావాలా స్నేహితుడు
అదార్ పూనావాలా నిర్వహిస్తున్న సిరిన్ ప్రొడక్షన్స్ , ధర్మ ప్రొడక్షన్స్ ఇప్పుడు సంయుక్తంగా విభిన్న రకాల కంటెంట్‌ను ఉత్పత్తి చేయనున్నాయి. అదార్ పూనావాలా సిరిన్ ప్రొడక్షన్స్ అంచనా ప్రకారం, ధర్మ ప్రొడక్షన్స్ విలువ 2000 కోట్ల రూపాయలు. ఈ నేపథ్యంలో అదార్ పూనావాలా ధర్మ ప్రొడక్షన్‌లో 50 శాతం షేర్‌ని 1000 కోట్లకు కొనుగోలు చేశారు. కరణ్ జోహార్ అదార్ పూనావాలా.. అతని భార్య నటాషా పూనావాలాకు చాలా సన్నిహిత స్నేహితుడు.
ఈ సందర్భంగా కరణ్ జోహార్ మాట్లాడుతూ ‘‘ప్రజలు మెచ్చుకునే మంచి చిత్రాలను నిర్మించాలని మా తండ్రి ఆకాంక్షించారు. నా మిత్రుడు అదార్ పూనావాలాతో కలిసి ధర్మ ప్రొడక్షన్స్‌ను మరింత ఉన్నత శిఖరాలకు చేరుస్తాం. భావోద్వేగ కథన శక్తి, భవిష్యత్తు బిజినెస్ ప్లాన్ సమ్మేళనమే మా భాగస్వామ్యం’’ అని ఆయన పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ధర్మ ప్రొడక్షన్స్ బహుముఖ కంటెంట్ శక్తి కేంద్రంగా మారనుందని సీఈవో అపూర్వ మెహతా పేర్కొన్నారు. పెద్ద ఎత్తున క్రియేటివిటీని తీసుకువచ్చేందుకు ఈ బంధం ఉపయోగపడుతుందన్నారు.