క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ధన్య బాలకృష్ణ కి చాలా ఫాలోయింగ్ ఉంది. నిజానికి ఆమె సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్. పైగా హీరోయిన్ గా కూడా నాలుగైదు సినిమాలు చేసింది. ‘లవ్ ఫెయిల్యూర్’, ‘ఎటో వెళ్లిపోయింది’ లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను కూడా తన నటనతో మెప్పించింది. నిజానికి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంలో మహేష్ బాబుకి సైట్ కొట్టే క్యారెక్టర్ తోనే ధన్యకు మంచి గుర్తింపు వచ్చింది.
కేవలం ఒక సీన్ లో నటించి ఆ రేంజ్ లో గుర్తింపు తెచ్చుకోవడం క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి సాధ్యమయ్యే పని కాదు, కానీ ధన్య మెప్పించింది, అలరించింది. అయితే ధన్య బాలకృష్ణకి తాజాగా ఇన్ స్టాగ్రామ్‌లో తన ఫాలోవర్స్ తో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఫాలోవర్స్ అడిగిన పలు ఆసక్తికరమైన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చింది.
ఇంతకీ ఆమె చెప్పిన అంశాలలో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు.. ధన్య బాలకృష్ణకి ఒక ముద్దు పేరు ఉందట. ఆ పేరే ‘పప్పు’. ఇంట్లోవాళ్ళు అలాగే స్నేహితులు కూడా ఆమెను పప్పు అనే పిలుస్తారట. ఇక ప్రస్తుతం ఆమె బెంగళూరులో ఉంటుంది. ‘రాజారాణి’ సినిమాలో తానూ మందు తాగినట్లు చూపించారని, కానీ అందులో అసలు నిజం లేదని, తనకు తాగుడు అలవాటు లేదని స్పష్టం చేసింది.
అయితే తాను మంచినీళ్లు తాగి, మందు తాగినట్టు నటించానని, అయినా ప్రేక్షకులు తన నటనను మెచ్చుకోవడం తనకు ఎంతగానో సంతోషాన్ని ఇచ్చిందని ఆమె చెప్పుకొచ్చింది. ఇక తానూ ఎక్కువగా పార్టీలు కూడా చేసుకోనని, పబ్ లకు వెళ్లడం అసలు అలవాటు లేదని, అయితే ప్రతి వీకెండ్ లో మాత్రం ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా భోజనానికి వెళ్తాను అంటూ తన పర్సనల్ కబుర్లు కూడా చెప్పుకొచ్చింది. పనిలో పనిగా అమ్మడికి పవన్ కల్యాణ్, సూర్య, రణ్‌బీర్ కపూర్ అంటే ఎంతో క్రష్ అని తన మనసులోని మాట మొహమాటం లేకుండా బయటపెట్టింది.
