CM Revanth Reddy Comments On Rajamouli: నిన్న సాయంత్రం హైదరాబాద్ లో తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహించిన ‘గద్దర్ అవార్డ్స్'(Gaddar Awards) కి ఎంతో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ ఈవెంట్ కి టాలీవుడ్ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులూ కూడా హాజరు అయ్యారు. ఒకప్పుడు ప్రభుత్వం తరుపున నంది అవార్డ్స్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు దానిని ‘గద్దర్ అవార్డ్స్’ గా మార్చారు. ఈ అవార్డు ఏ కళాకారుడికి అయినా ఒక అరుదైన గౌరవం లాంటిది. అప్పట్లో మొట్టమొదటి నంది అవార్డు ని అందుకున్నది అక్కినేని నాగేశ్వర రావు అయితే, ఇప్పుడు మొట్టమొదటి ‘గద్దర్ అవార్డు’ ని అందుకున్నది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. సుమారుగా పదేళ్ల నుండి సంచలన విజయాలు సాధించి ప్రేక్షకుల మన్ననలు అందుకున్న సినిమాలు, నటీనటులను గుర్తించి ఈ అవార్డ్స్ ని ప్రకటించారు. ఎంతో హృద్యంగా సాగిన ఈ వేడుక లో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
ఆయన మాట్లాడుతూ ‘ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ అని పిలిచేవాళ్ళు. ఇప్పుడు ఇండియన్ సినిమా అంటే మన తెలుగు సినిమా అని పిలుస్తున్నారు. ఆ స్థాయికి తీసుకొచ్చిన దర్శక నిర్మాతలకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు. అన్ని రంగాలతో సమానంగా సినీ పరిశ్రమ లో కూడా మన రాష్ట్రం అత్యున్నత స్థాయికి ఎదగడం అత్యవసరం. 2035 వ సంవత్సరం నాటికి మన తెలంగాణ GDP 3 ట్రిలియన్ డాలర్స్ కి ఎదగాలని ఒక విజన్ డాక్యుమెంట్ ని ఏర్పాటు చేసుకున్నాను. ఆ డాక్యుమెంట్ లో తెలుగు సినీ పరిశ్రమ గురించి ఒక చాప్టర్ కచ్చితంగా ఉండాలి. ఈరోజు మన తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎంతో మంది దిగ్గజాలు ఉన్నారు. మొదటి తరానికి ఎన్టీఆర్, ఏఎన్నార్ ప్రాతి నిధ్యం వహిస్తే, రెండవ తరానికి కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు..మూడవ తరానికి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున,వెంకటేష్..నాల్గవ తరానికి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan), మహేష్ బాబు(Superstar Mahesh Babu), అల్లు అర్జున్(Icon Star Allu Arjun) వంటి వారు ప్రాతి నిధ్యం వహిస్తున్నారు’.
‘రాజమౌళి(SS Rajamouli),సుకుమార్(Sukumar) లాంటి అద్భుతమైన ప్రతిభ గల వాళ్ళు ఉన్నారు. నేను ఈరోజు రాజమౌళి గారిని ఒక్కటే అడుగుతున్నాను, మీరు ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కిస్తూ వస్తున్నారు. కానీ ఎందుకు హాలీవుడ్, బాలీవుడ్ లను మన హైదరాబాద్ కి తీసుకొని రాలేకపోతున్నారు?, రాబోయే రోజుల్లో హాలీవుడ్ ఇక్కడికి రావాలి, అందుకు మా ప్రభుత్వం తరుపున మీకు ఏమి కావాలో అడగండి చేసి పెడుతాము. మా ప్రభుత్వం చూసేందుకు కాస్త కొన్ని విషయాల్లో కఠినంగా కనిపించొచ్చు, కానీ ఇండస్ట్రీ ఎదుగుదలకు అన్ని విధాలుగా సహకరిస్తాము’ అంటూ చెప్పుకొచ్చాడు సీఎం రేవంత్ రెడ్డి. ఆయన మాట్లాడిన ఈ మాటలకు సంబంధించిన వీడియో క్లిప్స్ ని ఇప్పుడు సోషల్ మీడియా లో నెటిజెన్స్ బాగా వైరల్ చేస్తున్నారు.