Yatra Movie: పొలిటికల్ బయోపిక్ లు అడ్డంగా తన్నేస్తున్న సమయంలో సరికొత్త యాత్ర కు శ్రీకారం చుట్టాడు మహీ వీ రాఘవ్. 2019లో ఎన్నికలకు ముందు ఈ సినిమాను విడుదల చేసి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని మరోసారి జనం తమ గుండెల్లో దాచుకునే విధంగా చేశాడు. ఫలితంగా ఆయన ఎన్నికల్లో వైసిపి తిరుగులేని విజయం సాధించింది. ఆ విజయంలో యాత్ర సినిమా పాత్ర కూడా ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అదే మహీ వీ రాఘవ్ వైయస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ నేపథ్యాన్ని వివరిస్తూ యాత్ర_2 సినిమా తీశాడు. అది ఇటీవల విడుదలైంది. ఆ సినిమా వైసీపీ నాయకులకు బాగా నచ్చుతున్నది. జగన్మోహన్ రెడ్డికి కూడా నచ్చింది అని చాలామంది అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక సెక్షన్ మీడియా మహీ వీ రాఘవ్ మీద ఆరోపణలు చేయడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఆ మీడియా సోమవారం ఒక కథనాన్ని ప్రచురించింది.
మహీ వీ రాఘవ్ తీసిన యాత్ర సినిమా నచ్చడంతో ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన హార్సీ లీ హిల్స్ లో రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించేందుకు రంగం సిద్ధం చేసినట్టు ఆ పత్రికలో ఒక కథనం ప్రచురితమైంది. ఇందుకు సంబంధించి స్వయంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహి దరఖాస్తును పరిశీలించి చర్యలు తీసుకోవాలని జిల్లా స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారట! యాత్ర_2 సినిమా విడుదల రోజే డివిజనల్ రెవెన్యూ ఆఫీసర్ స్థలాన్ని పరిశీలించారట! ఆ స్థలం బహిరంగ మార్కెట్లో దాదాపు 20 కోట్ల వరకు పలుకుతుందని.. ఎలాగు తనకు అనుకూలంగా సినిమా తీశాడు కాబట్టి నామమాత్రపు ధరకు రాఘవ్ కు కట్టబెట్టేందుకు దస్త్రాలు కదులుతున్నాయట.
ఇక సదరు మీడియా సంస్థ ప్రచురించిన వార్తపై మహీ వీ రాఘవ్ సామాజిక మాధ్యమాల వేదికగా పరోక్షంగా స్పందించారు..” నా మీద బురద చల్లారు. తప్పదు నేను కడుక్కుంటా.” అని యాత్ర_2 సినిమాలో తను రాసిన డైలాగ్ ను ప్రస్తావిస్తూ పరోక్షంగా ఆ మీడియా సంస్థపై విమర్శలు గుప్పించాడు. తాను తీసిన సినిమాలు మొత్తం రాయలసీమలోనే షూటింగ్ జరుపుకున్నాయని.. సీమ సౌందర్యాన్ని తన చిత్రాల్లో చూపించానని.. అలాంటప్పుడు రాయలసీమ ప్రాంతంలో ఒక స్టూడియో నిర్మిస్తే తప్పేంటి అని మహీ వీ రాఘవ్ ఎదురు ప్రశ్న వేశాడు. తాను స్టూడియో నిర్మిస్తే రాయలసీమ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని.. దానిని వేరే కోణంలో ఎందుకు చూస్తున్నారని ఆయన ప్రశ్నించారు. అయితే మహీ వీ రాఘవ్ స్థలం కోసం దరఖాస్తు చేసుకున్న విషయం నిజమేనని.. కాకపోతే స్థలం కేటాయింపుకు సంబంధించి తమకు ఎటువంటి ఆదేశాలు రాలేదని చిత్తూరు రెవెన్యూ అధికారులు అంటున్నారు. మరి ఆ మీడియా సంస్థ నేమో స్థలం కేటాయింపు కూడా పూర్తయిందని రాసింది. మరి ఇందులో నిజాలు ఏమిటో, అబద్ధాలు ఏమిటో కాలం గడిస్తే గాని తెలియదు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Cm jagan gave a two acres land to yatra 2 director
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com