CM Chandrababu : నందమూరి బాలకృష్ణ కి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ఇవ్వడంతో నందమూరి అభిమానులు ఏ రేంజ్ లో సంబరాలు చేసుకున్నారో మనమంతా చూసాము. సినీ ఇండస్ట్రీ కి ఆయన చేసిన సేవలు, రాజకీయ నాయకుడిగా ఆయన చేసిన పోరాటం, బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఆయన ఉచితంగా కాపాడిన ఎన్నో ప్రాణాలకు గుర్తుగా ఈ అవార్డు ఆయనకు ఎప్పుడో రావాల్సి ఉంది. కానీ చాలా ఆలస్యంగా వచ్చిందని అభిమానుల అభిప్రాయం. అయితే బాలయ్య కి ఈ పురస్కారం అందడంతో టాలీవుడ్ సినీ ప్రముఖులందరూ ఆయన్ని ఎంతలా అభినందించారో మనమంతా చూసాము. బాలయ్య తరంలో ఆయనకు పోటీగా నిలబడిన చిరంజీవి, వెంకటేష్ వంటి వారి దగ్గర నుండి, నేటి తరం స్టార్ హీరోల వరకు ప్రతీ ఒక్కరు బాలయ్య కి శుభాకాంక్షలు తెలియచేసారు. ఇదంతా పక్కన బాలయ్య సోదరి, చంద్రబాబు సతీమణి భువనేశ్వరి గారు నేడు తన అన్నయ్య కి పద్మభూషణ్ అవార్డు వచ్చిన సందర్భంగా ఒక ఈవెంట్ ని ఏర్పాటు చేసింది.
తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేసిన ఈ ఈవెంట్ కి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. సినీ ఇండస్ట్రీ నుండి కూడా పలువురు హీరోలు, దర్శక నిర్మాతలు ఈ ఈవెంట్ లో పాల్గొని, బాలయ్య గురించి ఎంతో గొప్పగా మాట్లాడాడు. ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ ‘అల్లరి బాలయ్య కాస్త, పద్మభూషణుడు అయ్యాడు. సినీ నటుడిగా 50 ఏళ్ళ నుండి ఎవర్ గ్రీన్ హీరోగా కొనసాగుతూ ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించాడు. ఒక విధంగా చెప్పాలంటే బాలయ్య నాకంటే సీనియర్. నేను 1978 వ సంవత్సరం లో ఎమ్మెల్యే అయ్యాను. బాలయ్య 1974 లోనే హీరో అయ్యాడు’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ఎన్టీఆర్ గారిలో ఉన్న పట్టుదల, కృషి బాలయ్య గారికి అబ్బింది. చూసేందుకు చాలా చిలిపిగా కనిపిస్తాడు కానీ, బాలయ్య లో ఎంతో లోతైన కృషి, పట్టుదల ఉన్నాయి. అవే ఆయన్ని నేడు ఈ స్థాయిలో నిల్చోబెట్టింది. కేవలం సినీ నటుడిగా మాత్రమే కాదు, మనిషిగా కూడా బాలయ్య బంగారం లాంటి మనిషి. జనాలకు ఎదో ఒక సేవ చేయాలనే దృక్పధంతో ఆయన బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ ని స్థాపించాడు. ఇక్కడికి వచ్చే ముందు కూడా ఆయన హాస్పిటల్ బోర్డు మీటింగ్ లో పాల్గొన్నాడు. ఇక రాజకీయాల్లో మూడు సార్లు వరుసగా ఎమ్మెల్యే అయ్యాడు. మూడు సార్లు కాదు, ఎన్ని ఎన్నికలు జరిగితే అన్ని ఎన్నికలకు బాలయ్యనే ఎమ్మెల్యే. ఒక్కోసారి ఆయన తన భార్య వసుందర కి ఎమ్మెల్యే టికెట్ అడుగుతూ ఉంటాడు’ అని అంటాడు చంద్రబాబు. అప్పుడు బాలయ్య ‘మా ఇద్దరికీ ఇచ్చేయండి’ అని అనగా, అలా ఇవ్వను కుటుంబానికి ఒక్కరికే ఎమ్మెల్యే టికెట్ అంటూ చంద్రబాబు సరదాగా మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
