Movie Piracy: మన టాలీవుడ్ ని మాత్రమే కాదు, అన్ని ఇండస్ట్రీస్ ని ఎప్పటి నుండో పైరసీ అనే భూతం ఎలా పట్టి పీడిస్తుందో మనమంతా చూస్తూనే ఉంటున్నాం. కానీ పైరసీ అనేది సర్వ సాధారణం అయిపోవడం,ఆడియన్స్ కూడా థియేటర్ ప్రింట్ ని చూసేందుకు ఆసక్తి చూపకపోవడం వల్ల పైరసీ 2023 వ సంవత్సరం వరకు పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కానీ 2024 వ సంవత్సరం నుండి విడుదలైన కొద్దిరోజులకే HD ప్రింట్ తో ఆన్లైన్ లో కొత్త సినిమాలు దర్శనం ఇవ్వడం సినిమా థియేట్రికల్ రన్ పై మెల్లిగా ప్రభావం చూపించడం మొదలు పెట్టింది. ఇక ఈ ఏడాది అయితే ‘గేమ్ చేంజర్'(Game Changer Movie) చిత్రం నుండి కొత్త సినిమాలకు పైరసీ మొదటి రోజు నుండే జరగడం మొదలైంది. ఇది ఇండస్ట్రీ మీద మామూలు రేంజ్ ప్రభావం చూపలేదు. థియేటర్స్ రెండవ రోజే ఖాళీ అయిపోయేవి.
ఇప్పటికీ ఇదే జరుగుతుంది. వందల కోట్ల రూపాయిలు ఖర్చు చేసి సినిమాలు తీస్తూ ఇలా పైరసీ జరుగుతుంటే ఏమి చెయ్యాలో అర్థం కావడం లేదని నిర్మాతలు ప్రెస్ మీట్స్ పెట్టి వాపోయిన సందర్భాలను ఇది వరకు మనం ఎన్నో చూసాము. అయితే రీసెంట్ గానే పోలీసులు ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన కిరణ్ కుమార్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇతను గత ఏడాది నుండి తెలుగు, తమిళ సినిమాలను పైరసీ చేస్తూ వస్తున్నాడు. కేవలం ఇతని కారణంగా 3700 కోట్ల రూపాయిల నష్టం సినీ ఇండస్ట్రీ కి జరిగిందట. ఇప్పటి వరకు 65 సినిమాలను పైరసీ చేసాడని, ఇతను థియేటర్స్ లో సైలెంట్ గా తన మొబైల్ ఫోన్ తో సినిమాని రికార్డు చేసి మూవీ రూల్స్, తమిళ్ మూవీ వంటి వెబ్ సైట్స్ కి అమ్ముతాడట. ఒక్కో సినిమాకు 30 నుండి 40 వేల వరకు తీసుకుంటాడట.
ఇది కేవలం ఒక్క వ్యక్తికీ సంబంధించిన డేటా మాత్రమే. ఇలా ఎంతో మంది ఈ పైరసీ మాఫియా లో ఉన్నారు. వీళ్ళు ఈ పైరసీ ద్వారా ఇండస్ట్రీ కి ఎంత నష్టం చేస్తున్నారో, అదే విధంగా వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారో ఊహించడానికి కూడా కష్టమే. దీనిపై తెలుగు సినిమా ఇండస్ట్రీ గట్టిగ పోరాటం చేయకపోతే, భవిష్యత్తులో థియేటర్స్ మొత్తం మూతపడడం గ్యారంటీ. అసలే ఓటీటీ కాలం,క్రమేణా థియేటర్స్ కి వచ్చే ఆడియన్స్ సంఖ్య ఏ రేంజ్ లో తగ్గిపోతుందో చూస్తూనే ఉన్నాం. ఇదే ట్రెండ్ కొనసాగితే ఇంకా తగ్గిపోయే అవకాశాలు లేకపోలేదు.