Chiranjeevi- Nagababu: సోగ్గాడే చిన్నినాయనా మూవీతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దానికి సీక్వెల్ బంగార్రాజు తెరకెక్కించారు. 2022 సంక్రాంతి కానుకగా విడుదలైన బంగార్రాజు పర్లేదు అనిపించుకుంది. హిట్ స్టేటస్ తో బయటపడింది. కళ్యాణ్ కృష్ణ స్కిప్ట్ తో మెగాస్టార్ చిరంజీవిని ఇంప్రెస్ చేశాడనే ప్రచారం జరుగుతుంది. ఆయన దర్శకత్వంలో చిరంజీవి మూవీ దాదాపు ఖాయమట. ఈ చిత్ర కథ విషయంలో ఆసక్తికర చర్చ నడుస్తుంది. కళ్యాణ్ కృష్ణతో చిరంజీవి మూవీలో టాలీవుడ్ యంగ్ హీరో నటించే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే వార్తలు వచ్చాయి.
కారణం స్క్రిప్ట్ అలాంటిది. చిరంజీవి వయసుకు తగ్గ పాత్రలో కనిపించనున్నారట. ఆయన పెళ్లీడుకొచ్చిన కొడుకును కలిగిన ఫాదర్ రోల్ చేస్తున్నారట. కథలో తండ్రీ కొడుకుల పాత్రలు కీలకం. కథ వారిద్దరి చుట్టే తిరుగుతుందట. ఇంకా చెప్పాలంటే తండ్రి కొడుక్కి పెళ్లి చేయాలని చూస్తుంటే తల్లిలేని కొడుకు తండ్రికి పెళ్లి చేయాలనుకుంటాడట.
నిజానికి ఇలాంటి కథనే గతంలో రచయిత వెలిగొండ శ్రీనివాస్ రాశారు. తండ్రిగా నాగబాబు, కొడుకుగా తరుణ్ లను ఎంచుకున్నారు. కొద్దిరోజుల్లో షూటింగ్ అనగా మూవీ ఆగిపోయింది. అదే తరహా కథను బెజవాడ ప్రసన్న కుమార్ రాశారట. ఆయన కథతోనే కళ్యాణ్ కృష్ణ చిరంజీవి మూవీ చేస్తున్నారట. ఈ క్రమంలో ఒకప్పుడు నాగబాబు చేయాల్సిన కథను చిరంజీవి చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది.
అయితే చిరంజీవి ఇమేజ్ దృష్టిలో పెట్టుకొని మాస్, కమర్షియల్ అంశాలు జోడించి సెంటిమెంట్ ప్రధానంగా తెరకెక్కించే సూచనలు కలవు. కాగా శ్రీకాంత్-కృష్ణంరాజు కాంబోలో ఇదే తరహా కథతో మా నాన్నకు పెళ్లి చిత్రం తెరకెక్కింది. మా నాన్నకు పెళ్లి సూపర్ హిట్ కొట్టింది. ఇక చూడాలి ఈ ప్రాజెక్ట్ ఎలాంటి మలుపులు తిరుగుతుందో. ప్రస్తుతం చిరంజీవి భోళా శంకర్ మూవీలో నటిస్తున్నారు. ఆగస్టు 11న ఇది విడుదల కానుంది.