Chiranjeevi Jagan Meeting: సినిమా టికెట్ల ధరల తగ్గింపు అంశం ఏపీలో కొద్దిరోజులుగా వివాదాస్పదంగా మారింది. గడిచిన రెండేళ్లుగా కరోనాతో ఇండస్ట్రీ అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నట్లుండి ప్రభుత్వం ఒక్కసారిగా టికెట్ల రేట్లను తగ్గించడంతో సినీ పరిశ్రమ కలవరానికి గురైంది. దీనిపై పలువురు సినీ పెద్దలు గతంలోనే ఏపీ సర్కారు దృష్టికి తీసుకెళ్లారు.
పేదలకు అందుబాటులో వినోదం ఉండాలనే ఉద్దేశ్యంతోనే టికెట్ల రేట్లను తగ్గించినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఈక్రమంలోనే సినీ పరిశ్రమకు, ఏపీ సర్కారు మధ్య కొంత గ్యాప్ నెలకొంది. ప్రభుత్వం నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు ఇండస్ట్రీ నుంచి పలువురు హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు తమకు తోచినట్లు మాట్లాడుతుండటంతో రోజుకో వివాదం నెలకొంటోంది.
ఈనేపథ్యంలోనే ఈ వివాదానికి శుభంకార్డు వేసేలా సీఎం జగన్మోహన్ రెడ్డి ఇండస్ట్రీ నుంచి మెగాస్టార్ చిరంజీవిని లంచ్ కు ఆహ్వానించారు. ఈ రోజు మధ్యాహ్నం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి చిరంజీవితో కలిసి లంచ్ చేశారు. అనంతరం ఇండస్ట్రీ సమస్యలను చిరంజీవి సీఎం దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.
సీఎం జగన్ తో భేటి ముగిశాక చిరంజీవి తిరిగి గన్నవరం ఎయిర్ పోర్టు చేరుకున్నారు. అక్కడ ఆయన మీడియాతో సీఎంతో జరిగిన భేటి వివరాలను వెల్లడించారు. సీఎంతో జరిగిన సమావేశం తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని తెలిపారు. సీఎం తనను ఓ సోదరుడిగా భావించి పండుగవేళ భోజనానికి ఆహ్వానించడం.. అప్యాయంగా మాట్లాడటం తనకు ఎంతో నచ్చిందని చిరంజీవి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
జగన్ సతీమణి భారతిగారు తనకు భోజనాన్ని వడ్డించడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని తెలిపారు. వారివురికి తన హృదయపూర్వక ధాన్యవాదాలు తెలియజేస్తున్నానని చిరంజీవి అన్నారు. అలాగే సినిమా టికెట్ల ధరల అంశంపై సీఎం సానుకూలంగా ఉన్నట్లు తెలిపారు. ఇండస్ట్రీకి మేలు చేసే ఉద్దేశ్యమే తప్ప మరో ఆలోచన తమ ప్రభుత్వానికి ఏమిలేదని సీఎం చెప్పారని చిరంజీవి గుర్తు చేశారు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒకే కోణంలో కాకుండా రెండో కోణం కూడా తెలుసుకోవాలని ఆయన అన్నారని చిరంజీవి చెప్పారు.
సీఎం తనపై ఎంతో నమ్మకంతో సినీ పరిశ్రమ నుంచి తనను ఆహ్వానించారని తెలిపారు. సామాన్యుడికి వినోదం అందుబాటులో ఉంచాలని సీఎం జగన్ పడుతున్న తాపత్రాయాన్ని చిరంజీవి అభినందించారు. అలాగే చిత్ర పరిశ్రమ, ఎగ్జిబిటర్లు, థియేటర్ యజమానుల కష్టనష్టాలను వివరించానని చెప్పారు. దీనికి సీఎం సానుకూలంగా స్పందించారని తెలిపారు. త్వరలోనే అందరికీ ఆమోద యోగ్యకరమైన నిర్ణయం కమిటీ ముందుకు వస్తుందని చిరంజీవి తెలిపారు. మరో రెండు, మూడువారాల్లో టికెట్ల ధరల వివాదానికి పుల్ స్టాప్ పడుతుందని చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేశారు.