
Chiranjeevi : ఎవరెస్ట్ ఎక్కాలంటే ఆ శిఖరానికి మించిన ధైర్యం, ఆత్మస్థైర్యం ఉండాలి. కేవలం శక్తి ఉంటే సరిపోదు. హీరో కావడం కూడా అలాంటి సాహసమే. టాలెంట్ కి మించి మనోధైర్యం, గుండె నిబ్బరం కావాలి. ఎదిగే క్రమంలో చాలా సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మెగాస్టార్ అనే తిరుగులేని బిరుదు వెనుక చిరంజీవి కనిపించని కష్టాల ప్రయాణం ఉంది. హీరోగా ఎదిగే క్రమంలో ఆయనకు ఎదురైన అనుభవాలు ‘నిజం విత్ స్మిత’ షో వేదికగా వెల్లడించారు. చిరంజీవి మాట్లాడుతూ… పరిశ్రమకు వచ్చిన కొత్తలో చాలా అవమానాలు ఎదుర్కొన్నాను. మానసిక క్షోభకు గురయ్యాను. నా భాద ఎవరితో చెప్పుకునేవాడిని కాదు. నన్ను నేనే సమాధానపరచుకొని సాధారణ జీవితంలోకి వచ్చేవాడిని.
మద్రాసుకి వచ్చిన కొత్తలో పాండిబజార్ కి వెళ్ళాను. అక్కడ ఓ వ్యక్తి ‘ఏంటి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చేరావా? హీరో అవుదామనే! అతని కంటే అందంగా ఉన్నావా?. బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో ఎదగడం కష్టం. హీరో కావాలన్న కలను మర్చిపో’ అని ఎగతాళిగా మాట్లాడాడు. ఇంటికి వచ్చి చాలా బాధపడ్డాను. దేవుడు ముందు కూర్చొని ఇలాంటి వాటికి బెదరకూడదు అని నిర్ణయించుకున్నాను. ఒక ఏడాది పాటు పాండిబజార్ కి వెళ్లలేదు. ఇప్పుడు కూడా ఎవరైనా నన్ను చులకన చేసి మాట్లాడితే నేను బాధపడను. ఫేమస్ కావడానికి నా గురించి మాట్లాడుతున్నారు అనుకుంటాను.. అని చిరంజీవి చెప్పుకొచ్చారు.
ఒక స్థాయికి ఎదిగాక పొగడ్తలు, విమర్శలు రెండూ ఎదురవుతాయి. నాకు అది అనుభవపూర్వకంగా తెలిసింది. ప్రజారాజ్యం పార్టీ స్థాపించాక ప్రచార సమయంలో షాకింగ్ సంఘటన ఎదురైంది. జగిత్యాలలో పూలు జల్లుతూ ఘన స్వాగతం పలికారు. కాసేపటికే కొందరు నాపై గుడ్లు విసిరారు. నా మాటలు వాళ్లకు నచ్చలేదేమో అనుకున్నాను. ఆ అనుభవం నేను ఎప్పటికీ మర్చిపోలేను. జీవితమంటే ఇదే ప్రశంసలు, విమర్శలు రెండూ సమానంగా తీసుకోవాలని చిరంజీవి చెప్పుకొచ్చారు.
నా కెరీర్ బిగినింగ్ లో నటించిన చిత్రాలు మీరు గమనించినట్లయితే మెడలో ఆంజనేయ స్వామి లాకెట్ కలిగిన వెండి చైన్ ఉంటుంది. అది ఎక్కడో దొరికితే మా నాన్న నాకు తీసుకొచ్చి ఇచ్చారు. కెరీర్ బిగినింగ్ లో ఏ ఇబ్బంది వచ్చినా అదే కాపాడుతుందని నేను గట్టిగా నమ్మేవాడిని. ఒకరోజు షూటింగ్ లో ఆ చైన్ పోయింది. చాలా కంగారు పడ్డాను. ఆ రోజు రాత్రి నిద్రపట్టలేదు. నెక్స్ట్ డే వెతికే దొరికింది. కానీ కొన్నాళ్ల తర్వాత అన్నయ్య మూవీ షూట్లో ఎవరో దాన్ని ఎత్తుకు పోయారని చిరంజీవి తండ్రి ఇచ్చిన ఆ గొలుసు గుర్తు చేసుకున్నారు.