Chiranjeevi Viswambhara: మెగాస్టార్ చిరంజీవి జోరు మామూలుగా లేదు. ఏడు పదుల వయసు దగ్గరపడుతున్నా విరామం లేకుండా సినిమాలు చేస్తున్నారు. గత రెండేళ్లలో చిరంజీవి నుండి నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. భోళా శంకర్ విడుదలై నెలలు గడవక ముందే మరో ప్రాజెక్ట్ ప్రకటించారు. బింబిసార మూవీతో పరిశ్రమ దృష్టిని ఆకర్షించిన యువ దర్శకుడు వశిష్ఠ దర్శకత్వంలో మూవీ చేస్తున్నారు. మెగాస్టార్ 156వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ కి విశ్వంభర అనే టైటిల్ నిర్ణయించారు. సంక్రాంతి కానుకగా టైటిల్ ప్రకటించారు.
కాగా నేడు అధికారికంగా విడుదల తేదీ ప్రకటించారు. విశ్వంభర 2025 సంక్రాంతి కానుకగా విడుదల కానుందని ఇటీవల ఓ న్యూస్ వెలుగులోకి వచ్చింది. అనుకున్నట్లే విశ్వంభర సంక్రాంతి బరిలో దిగుతుంది. జనవరి 10న విడుదల చేస్తున్నట్లు నేడు పోస్టర్ విడుదల చేశారు. విడుదల తేదీ ప్రకటన పోస్టర్ సైతం ఆసక్తి కలిగిస్తుంది.
2023 సంక్రాంతికి వాల్తేరు వీరయ్య మూవీతో వచ్చిన చిరంజీవి భారీ విజయం అందుకున్నారు. వాల్తేరు వీరయ్య రెండు వందల కోట్ల రూపాయలకు పైగా వసూళ్లతో సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. విశ్వంభర పాన్ ఇండియా మూవీగా విడుదలవుతుండగా… బాక్సాఫీస్ షేక్ చేయడం ఖాయం అంటున్నారు. విశ్వంభర మూవీ కోసం చిరంజీవి మేకోవర్ అవుతున్నాడు. ఆయన జిమ్ లో కసరత్తులు చేస్తున్నారు.
విశ్వంభర సోషియో ఫాంటసీ చిత్రం. చిరంజీవి పాత్రలో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయట. ఈ మధ్య కాలంలో ఎన్నడూ చూడని లుక్ లో చిరంజీవి దర్శనం ఇవ్వనున్నాడట. అందుకే చిరంజీవి బరువు తగ్గి స్లిమ్ అండ్ ఫిట్ గా తయారు కానున్నారు. ఇక విశ్వంభర మూవీలో ముగ్గురు హీరోయిన్స్ వరకు నటించే అవకాశం కలదట. మొత్తంగా విశ్వంభర విషయంలో మెగాస్టార్ ప్లానింగ్ అదిరిందని చెప్పాలి.