Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి చాలా సౌమ్యుడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం. హీరోగా ఆయన అనేక ఉన్నత శిఖరాలు అధిరోహించారు. ప్రతి ఒక్కరినీ ఆయన గౌరవిస్తారు. అందుకే చిరంజీవి అంటే ఇష్టపడని వారుండరు. ఇతరులనే అంతగా ప్రేమించే చిరంజీవి తన సహచరిణి సురేఖను ఎంత బాగా చూసుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విషయం పై చిరంజీవి స్వయంగా స్పందించారు. తన భార్యతో తన అనుబంధం ఎలాంటిదో గుర్తు చేసుకున్నారు.
చిరంజీవి మాట్లాడుతూ… 43 ఏళ్ల మా వైవాహిక జీవితంలో సురేఖ మీద నేను కోప్పడిన సందర్భం లేదు. ఏనాడు ఆమె మీద చిరాకు పడలేదు. చేయి ఎత్తలేదు. దురుసుగా ప్రవర్తించలేదు. దానికి కారణం సురేఖలో ఉన్న ఓర్పు, సహనం. ఆమె అర్థం చేసుకున్నంతగా నన్ను ఎవరూ అర్థం చేసుకోలేరు… అని చెప్పుకొచ్చారు. సురేఖ అంటే చిరంజీవికి ఉన్న ప్రేమ, అభిమానం, అనుబంధం, పరస్పర అవగాహన ఆయన మాటల్లో తెలుస్తున్నాయి. చిరంజీవి ఎక్కడికి వెళ్లినా సురేఖ వెంట ఉండాల్సిందే. అప్పుడప్పుడు ఇద్దరు ఏకాంతంగా విహారాలకు వెళతారు.
ఇప్పటికీ రొమాంటిక్ కపుల్ మాదిరి ఫీల్ అవుతారు. నటుడు అల్లు రామలింగయ్య కుమార్తె అయిన సురేఖను చిరంజీవి వివాహం చేసుకున్నాడు. 1980లో చిరంజీవి-సురేఖల వివాహం ఘనంగా జరిగింది. పెళ్లి నాటికి చిరంజీవి ఇంకా స్టార్డం రాలేదు. ఎదిగే దశలో ఉన్నాడు. అల్లు రామలింగయ్య స్టార్ కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్. చిరంజీవి లోని క్రమశిక్షణ, టాలెంట్ చూసిన అల్లు రామలింగయ్య… కుర్రాడికి భవిష్యత్తు ఉందని నమ్మాడు. అందుకు అల్లుడిని చేసుకున్నాడు.
సురేఖ జీవితంలోకి వచ్చాక చిరంజీవి దశ తిరిగింది. సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్స్ ఇస్తూ టాలీవుడ్ టాప్ హీరో అయ్యాడు. చిరంజీవి ఎదుగుతూ… అల్లు అరవింద్ అభివృద్ధికి కారణమయ్యాడు. చిరంజీవి హీరోగా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో పలు హిట్ చిత్రాలు తెరకెక్కాయి. గీతా ఆర్ట్స్ టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థల్లో ఒకటిగా నిలిచింది. చిరంజీవి-సురేఖ దంపతులకు ముగ్గురు సంతానం. పెద్దమ్మాయి సుస్మిత నిర్మాతగా ప్రయత్నాలు చేస్తుంది. మరో అమ్మాయి శ్రీజ. అబ్బాయి రామ్ చరణ్ టాప్ స్టార్ గా ఎదిగి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు.