అల్లు రామలింగయ్య వర్ధంతి నేడు. తెలుగు సినీ ప్రేక్షకుల అందరి మనస్సుల్లో ఆయన తన హాస్యంతో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ఆయనకు నివాళులర్పిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా అల్లు రామలింగయ్య గారి వర్ధంతి సందర్భంగా ఆయనతో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
చిరంజీవి మాటల్లో.. ‘శ్రీ అల్లు రామలింగయ్య గారి భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన నేర్పిన జీవిత సత్యాలు ఎప్పటికీ మార్గదర్శకంగా ఉంటాయి. ఒక డాక్టర్ గా, యాక్టర్ గా, ఫిలాసఫర్ గా, ఓ అద్భుతమైన మనిషిగా, నాకు మావయ్యగా ఆయన ఎల్లప్పుడూ మా స్మృతుల్లో ఉంటారు. ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన జ్ఞాపకాలు మరోసారి నెమరువేసుకుంటూ ..’అంటూ మెగాస్టార్ ఒక మెసేజ్ పోస్ట్ చేశారు.
ఇక గతంలో అల్లు రామలింగయ్య ఫోటోకి నివాళులర్పిస్తున్న ఫోటోలను కూడా చిరు ట్వీట్ చేశారు. అల్లు రామలింగయ్య 1922 అక్టోబరు 1న పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు లో జన్మించారు. ఏడుగురు సంతానంలో అల్లు రామలింగయ్య నాలుగో వ్యక్తి. ఆయనకు నాటకాలు అంటే ఎంతో మక్కువ. ఆ ఆసక్తితోనే ఊర్లు తిరుగుతూ నాటకాలు వేస్తూ ఉండేవారు.
చివరకు నటన పై మక్కువతో సినిమా రంగంలోకి వచ్చారు. ‘పుట్టిల్లు’ అనే చిత్రంతో అల్లు రామలింగయ్య తొలిసారి మేకప్ వేసుకున్నారు. వేయికి పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. 1990లో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీని కూడా అందుకున్నారు. తెలుగు సినిమా వందేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం ఓ స్టాంపును కూడా రూపొందించారు.