Chiranjeevi- Garikapati: మెగాస్టార్ చిరంజీవిది సూపర్ టైమింగ్ అంటారు. ఆన్ స్క్రీన్లోనే కాకుండా ఆఫ్ స్క్రీన్లో కూడా చిరు సందర్భానుసారంగా వేసే జోకులు, సైటర్లు ఓ రేంజ్ లో పేలుతూ ఉంటాయి. తాజాగా చిరంజీవి ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసుకున్నారు. గరికపాటి నరసింహారావుకు చల్లగా చురక అంటించారు. ఓ ప్రైవేట్ ఈవెంట్లో పాల్గొన్న చిరంజీవితో ఫోటోలు దిగడానికి మహిళలు ఆసక్తి చూపిన నేపథ్యంలో… ఇక్కడ ఆయన లేరు కదా, అంటూ సెటైర్ వేశారు. కొద్దిరోజుల క్రితం అలయ్ బలయ్ వేదికగా వివాదం చోటు చేసుకుంది. అవధాని గరికపాటి నరసింహారావు నోటి దురుసు వివాదాస్పదమైంది.

బీజేపీ నేత బండారు దత్తాత్రేయ దసరా పండుగను పురస్కరించుకుని హైదరాబాద్ వేదికగా అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ ఏడాది చిరంజీవికి కూడా ఆహ్వానం అందింది. దీంతో ఆయన పాల్గొనడం జరిగింది. వేదికపై గరికపాటి నరసింహారావు ప్రసంగిస్తున్న సమయంలో చిరంజీవి ఒకపక్కన మహిళా అభిమానులతో ఫోటోలు దిగుతున్నారు. ఇది గరికపాటి మనసు నొచ్చుకునేలా చేసింది. మైకులో బహిరంగంగా తన అసహనం బయటపెట్టారు. చిరంజీవి గారు ఆ ఫోటో షూట్ ఆపాలి. లేదంటే నేను ప్రసంగం చేయకుండా వెళ్ళిపోతాను, అన్నారు.
గరికపాటి మాటలు విన్న చిరంజీవి వెంటనే ఫోటోలు దిగడం ఆపేసి వేదికపై ఉన్న పెద్దల వద్దకు వచ్చి వారితో జాయిన్ అయ్యారు. చిరంజీవిని కించపరిచేలా ఉన్న గరికపాటి వ్యాఖ్యలు అభిమానులను బాధపెట్టాయి. వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్న నేపథ్యంలో గరికపాటి చిరంజీవికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.చిత్ర ప్రముఖులు సైతం గరికపాటి తీరును ఖండించారు. చిరంజీవి ఒకటి రెండు సందర్భాల్లో సామరస్యంగానే ఈ వివాదంపై స్పందించారు.

ఆయన పెద్దవారు ఏం మాట్లాడాలో ఆయనకు తెలుసు దీనిపై చర్చ అనవసరం అన్నారు. అలాగే వెంటనే రియాక్ట్ కావడం, ఎదురు దాడి చేయాల్సిన అవసరం లేదన్నారు. దీంతో గరికపాటి-చిరు వివాదం ముగిసింది. కాగా చిరంజీవి నిన్న ఒక పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదికపై కొందరు మహిళలు ఆయనతో ఫోటోలు దిగారు. ఇది జరుగుతుండగా.. చిరంజీవి ”ఇక్కడ ఆయన లేరు కదా” అంటూ గరికపాటికి పరోక్షంగా చురక అంటించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.