Chitrapuri Chiranjeevi : పుణ్యం చేయబోతే పాపం ఎదురొచ్చినట్లుగా మెగాస్టార్ చిరంజీవి అనుకోని వివాదంలో చిక్కుకున్నారు. తనకు పెద్దరికం, కుర్చీలు, పదవులు అక్కరలేదన్న మెగాస్టార్.. ఇటీవల ప్రారంభించిన చిత్రపురి కార్మికుల కాలనీలో ఆస్పత్రి నిర్మాణంలో తనకు తెలియకుండానే వివాదంలో ఇరుక్కున్నారు. కొంతమంది చిల్లర అభిమానుల కారణంగా మెగా ఇమేజ్‌కే మచ్చ వచ్చే పరిస్థితి ఏర్పడింది. కాలనీలో 20 ఏళ్ల క్రితం ప్రారంభించిన ఇళ్ల నిర్మాణం ఇటీవల పూర్తయింది. చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై ఇళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలనీలో ఆస్పత్రి నిర్మిస్తామని ప్రకటించారు.

-ప్రభాకర్‌రెడ్డి చొరవతో కాలనీ..
చిత్రపురి కాలనీ నిర్మాణానికి ఆద్యుడు సీనియర్ నటుడు ఎం.ప్రభాకర్‌రెడ్డి. ఆయన పేరుమీదనే ఆ కాలనీకి పేరు కూడా పెట్టారు. అయితే ఆయన కూతురు శైలజారెడ్డి ఇటీవల సంచలన ఆరోపణలు చేశారు. చిరంజీవి ఆస్పత్రి కట్టిస్తామని ప్రకటించిన నేపథ్యంలో స్పందించిన శైలజారెడ్డి తాము ఆస్పత్రి నిర్మించాలని ఎప్పుడో నిర్ణయించుకున్నామన్నారు. కానీ కొంతమంది చిరంజీవి పేరు చెప్పి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అంతటితో ఆగకుండా కాలనీతోపాటు ఆస్పత్రి కూడా ప్రారంభించాల్సి ఉందని, కానీ చిరంజీవే నిర్మించాలని కొందరు తమను ఆపేశారన్నారు. కాలనీ నిర్మాణానికి తమ తండ్రి కారణమని, కానీ ప్రారంభోత్సవానికి తమకు కనీసం ఆహ్వానం కూడా పంపలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
-మెగా ఇమేజ్ దెబ్బతీసేలా…
నాడు ప్రభాకర్‌రెడ్డి కానీ, నేడు చిరంజీవికానీ కార్మికుల సంక్షేమమే కోరుకున్నారు. వారికి మెరుగైన సౌకర్యాలు అందుబాటులో ఉండాలని భావించారు. కానీ చిరంజీవి తనకు తెలియకుండా కొంతమంది చిల్లర అభిమానుల మూలంగా చిక్కుల్లో పడ్డారు. మెగా ఇమేజ్ను దెబ్బతీయాలని చూసే ఇలాంటి వారి కారణంగా ఇండస్ట్రీలో గౌరవంగా ఉన్న చిరంజీవికి ఒక మచ్చలా మారింది. కానీ వీరి ప్రయత్నాలు ఎప్పటికీ ఫలించవు. మెగాస్టార్ ఇమేజ్ దెబ్బతీయాలని చూస్తే ఆకాశంపై ఉమ్మివేసినట్లే. శైలజారెడ్డి కూడా వాస్తవాలను గుర్తించాలని మెగా అభిమానులు కోరుకుంటున్నారు.