
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వ ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ప్రతీ సినిమా అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంది. కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు యాక్షన్, కమర్షియల్ హంగులు సమపాళ్లలో ఉంటాయి. క్లీన్ కామెడీకి కేరాఫ్ అడ్రస్ ఆయన. కుల, మత ప్రస్తావన లేకుండా అశ్లీల పదజాలం వాడకుండా తెరపై హాస్యం పడించడంలో త్రివిక్రమ్‌కు తిరుగులేదు. అతడు, జల్సా, ఖలేజా, జులాయి, అత్తారింటికి దారేది నుంచి మొన్నటి అలవైకుంఠపురములో వరకు తన మార్కు కామెడీతో ప్రేక్షకులను మురిపించాడు. మరోవైపు ఎంత మాస్ ఇమేజ్ ఉన్నా కామెడీ పండించడంలో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకతే వేరు. ప్రతి సినిమాలో తన మార్కు హ్యూమర్ ఉండేలా చూసుకుంటాడు చిరు. సేమ్ త్రివిక్రమ్ మాదిరిగానే తెరపై క్లీన్ కామెడీ పండిస్తారాయన. అలాంటిది వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా వస్తే.. అది పూర్తిగా కామెడీ ఎంటర్టైనర్ అయితే… త్రివిక్రమ్ మార్కు పంచ్ డైలాగ్స్, సెటైర్స్‌ను తనదైన టైమింగ్‌తో చిరు పలికితే ఎలా ఉంటుంది. ఊహించుకుంటేనే చాలా కొత్తగా అనిపిస్తోంది కదూ..! అంతా అనుకున్నట్టు జరిగితే చిరు- త్రివిక్రమ్ కాంబోలో ఓ కామెడీ ఎంటర్టైనర్ రానుంది.
Also Read: నెట్టింట్లో ‘ఆంటీ’ ఐటమ్ సాంగ్ వైరల్
మెగా ఫ్యామిలీలో ఇప్పటికే పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్‌తో మూడేసి సినిమాలు తీసిన ఈ మాటల మాంత్రికుడు తొందర్లోనే చిరును కూడా డైరెక్ట్ చేయబోతున్నాడని సమాచారం. చిరు బాడీ లాంగ్వేజ్‌కు సూటయ్యే కామెడీ ఎంటర్టైనర్ కథ రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో మరో విశేషం ఏంటంటే ఇది దొంగ స్వామీజీలు, బాబాలపై రాసిన కథ అని తెలుస్తోంది. ఇందులో చిరు స్వామీజీ వేషంలో ఫుల్ కామెడీ పండిస్తారట. త్రివిక్రమ్ ఇప్పటికే చిరును కలిసి లైన్ చెప్పాడట. అది బాగా నచ్చడంతో పూర్తి స్థాయి కథ సిద్ధం చేయాలని మెగాస్టార్ సూచించారట. ఈ సినిమాలో ఓ మెసేజ్ కూడా ఉంటుందని, భక్తి ముసుగులో దొంగ స్వామీజీలు ప్రజలను ఎలా మోసం చేస్తున్నారో ఎత్తి చూపిస్తారట. ఇలాంటి స్టోరీలతో ఇది వరకే సినిమాలు వచ్చినా తనదైన హాస్యంతో కడుబుబ్చా నవ్వించడంతో పాటు ప్రజల్లో చైతన్యం రగిలించే కథనం సిద్ధం చేసే పనిలో త్రివిక్రమ్ ఉన్నారని సమాచారం.
Also Read: వెబ్ సిరీస్‌లో రేణు దేశాయ్ ‘ఆహా’ అనిపిస్తుందా?
ప్రస్తుతం చిరు.. కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’లో నటిస్తున్నారు. ఇంకోవైపు జూనియర్ ఎన్టీఆర్30వ సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహించనున్నారు. ఈ రెండూ పూర్తయ్యాక.. చిరు- త్రివిక్రమ్ కాంబో పట్టాలెక్కే అవకాశం కనిపిస్తోంది. ఇది వరకు త్రివిక్రమ్ కథ, డైలాగ్స్ అందించిన ‘జై చిరంజీవ’లో చిరు నటించారు. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో పూర్తి స్థాయి హాస్య చిత్రం వస్తే అభిమానులకు అంతకుమించిన కిక్కేముంటుంది.