Telugu film industry: తెలుగు సినిమా నిండా అంతా ‘కమ్మ’దనమే.. అందుకే సిని’మా’ కళాకారులంతా.. ‘కులా’కారులే అని ఓ నానుడి ఉండిపోయింది. నిజాలు జనాలకు అనవసరం, పుకార్లే వాళ్లకు గిలిగింతలు పెడతాయి. అందుకే, తెలుగు చిత్రసీమలో కులాల గోల బాగా నలుగుతూ వచ్చింది.. ఇంకా వస్తూనే ఉంది. అసలు తెలుగు నటీనటులకు కులాలు ఉన్నాయా ? మెగా ఫ్యామిలీలో కులం అడ్డుగోడలు ఎప్పుడో తొలిగిపోయాయి. చరణ్, బన్నీ, నిహారిక ఇలా చాలామంది ఆ కుటుంబంలో వేరే కులం వారిని పెళ్లి చేసుకున్నారు.

ఇటు మంచు ఫ్యామిలీని చూసినా.. అందరూ కులాంతర వివాహాలే. అటు నందమూరి వంశంలోనూ తారక్ రత్న కులాంతర వివాహమే చేసుకున్నాడు. ఇక అక్కినేని ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముందు జనరేషన్ నుంచే ఆ కుటుంబంలో దీపాలు వెలిగించింది వేరే కులం ఆడబిడ్డలే. కానీ ’మా’ ఎన్నికల పుణ్యమా అని కులాల కుంపట్లు రగిలాయి.
అసలు ‘మా’ ఎన్నికల్లో ‘కమ్మ’దనం కంపు ఎంత ఉందో తెలియదు గానీ, ఆ ఎన్నికలను ‘కాపు’కాసేయడానికి చాలామంది పోటీ పడ్డారు. ‘అసలు వాళ్ళు’ సైలెంట్ గా ఉంటే.. కొసరు వాళ్ళు వైలెంట్ గా మారిపోయారు. మొత్తానికి ‘మా’ ఎన్నికలు ముగిశాయి. జనానికి మంచి వినోదాన్ని పంచాయి. కానీ మధ్యలో కులం గొలను కెలికాయి ఎన్నికలు.
దీనికితోడు తాజాగా కోట శ్రీనివాసరావు లాంటి సీనియర్ నటుడు ఇంకా ‘కమ్మ’దానానికి దాసోహం అంటూ గులాంగిరి చేయడం ఆశ్చర్యకరం. తాజాగా కోట ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తెలుగు సినిమా రంగంలో కులాల ఆధిపత్యం ఉందా ? అని అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం చెబుతూ.. ‘ఇక్కడే ఉన్నదే కులం’ అని చెప్పుకొచ్చాడు.
అంతటితో ఆపి ఉంటే పెద్దరికానికి గౌరవం ఉండేది. కానీ కోట మాట్లాడుతూ.. తాను తన సినిమా కెరీర్ లో 95% కమ్మవారిపైనా ఫుడే తిన్నానని, అందుకే తాను కమ్మ పక్షపాతినని అంటూ సగర్వంగా చెప్పుకొచ్చాడు. ఇక మిగిలిన 5% లో రెడ్లు, రాజులు గురించి రెండు ముక్కలు మాట్లాడాడు. అయితే, కాపు కులం ప్రస్తావన తీసుకురావడానికి కూడా కోట ఆసక్తి చూపించలేదు.
కానీ, కోట శ్రీనివాసరావు నటుడిగా ఎదగడానికి ముఖ్య కారణం.. బ్రాహ్మణ కులానికి చెందిన జంధ్యాల, కాపు కులానికి చిరంజీవినే. జంధ్యాల, కోటకు నటుడిగా ప్రాణం పోస్తే.. చిరంజీవి ఆ ప్రాణానికి గుర్తింపు రావడానికి అవకాశం కల్పించాడు. తన సినిమాల్లో కోట శ్రీనివాసరావుకు చిరంజీవి ఎన్నో మంచి పాత్రలు ఇప్పించారు. అలాగే పవన్ కళ్యాణ్ సినిమాల్లో సైతం కోట గొప్ప పాత్రలు పోషించారు.
అయినా కమ్మవారి దయవల్లే బతికాననుకోవడం కచ్చితంగా తప్పే. అలాగే కమ్మవారిని తక్కువ చేసి మాట్లాడటం కూడా తప్పే. ఎందుకంటే తెలుగు సినిమా రంగం మొదట్లో కమ్మవారి కష్టం వల్లే కొంతవరకు ఎదిగింది. కానీ కమ్మవారే తెలుగు చిత్రసీమను అభివృద్ధి చేశారనడం సరికాదు. అసలు ఇలాంటి మాటలు మిగిలినవారికి మింగుడు పడవు.
సినిమా ఇండస్ట్రీలో అన్ని కులాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. అందరి సమిష్టి కృషి వల్లే ఏ ఇండస్ట్రీ అయినా ఎదుగుతుంది. ఏది ఏమైనా ఇన్నాళ్లు కులాల ప్రస్తావన గుంభనంగా ఉంటూ వచ్చింది. కానీ కోట శ్రీనివాసరావు లాంటి పెద్ద మనిషి మాటల కారణంగా అగాధం పెరిగేలా ఉంది. మొత్తమ్మీద ఈ ‘కమ్మ’ని మాటల కారణంగా కోట పై మాకు గౌరవం పోయిందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.