Case Against Nayanthara: నవదంపతులు నయనతార-విగ్నేష్ ఓ సమస్య లో చిక్కుకున్నారు. వీరిద్దరిపై కేసు నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే సోషల్ మీడియాలో ట్రోల్స్, విమర్శలకు గురవుతున్నారు. నయనతార, విఘ్నేశ్‌ల వివాహం గురువారం జూన్ 9న ఉదయం చెన్నై సమీపంలోని మహాబలిపురం వడనెమ్మేలిలోని షెరటాన్ గ్రాండ్ హోటల్‌లో జరిగింది. ఈ వివాహ వేడుకలో రజినీకాంత్, షారుక్ ఖాన్ వంటి టాప్ స్టార్స్ పాల్గొన్నారు. ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్న ఈ జంట పెళ్లి బంధంతో ఒకటయ్యారు.
ఇక నూతన వధూవరులు విగ్నేష్-నయనతారలకు అభిమానులు సోషల్ మీడియా వేదికగా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు. జంట చూడముచ్చటగా ఉందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆనందకరంగా సాగుతున్న ఈ వేడుకలో అపశృతి చోటు చేసుకుంది. ఈ దంపతులు చేసిన ఓ పొరపాటు వాళ్ళను న్యాయపరమైన ఇబ్బందుల్లోకి నెట్టనుంది. నయనతార-విగ్నేష్ వివాహం తిరుమల శ్రీవారి సన్నిధిలో జరగాల్సి ఉంది. కొన్ని అనివార్య కారణాల వలన పెళ్లి వేదిక తిరుపతి నుండి మహాబలిపురం కి మార్చారు.
ఈ క్రమంలో పెళ్ళైన వెంటనే తిరుమల శ్రీవారిని దర్శించాలని నయనతార-విగ్నేష్ నిర్ణయించుకున్నారు. దీనిలో భాగంగా జూన్ 10 శుక్రవారం సాయంత్రం తిరుమలను సందర్శించారు. దర్శనం అనంతరం తిరుమల మాడవీధుల్లో ఇద్దరు ఫోటోలు దిగారు. ఆ ఫోటోలు బయటికి రావడంతో వివాదం రాజుకుంది. ఆలయ ప్రాంగణంలో నయనతార చెప్పులు వేసుకుని తిరిగినట్లు అధికారులు గుర్తించారు. అత్యంత పవిత్ర ప్రదేశంలో నయనతార చెప్పులతో సంచరించడం పట్ల విమర్శలు వెల్లువెత్తాయి.
కొత్త పెళ్లి కూతురు నయనతారపై నెటిజెన్స్ విమర్శలు గుప్పించారు. ఆలయ పరిసరాల్లో చెప్పులతో తిరగకూడదని తెలియదా అంటూ ఆమెను ప్రశ్నిస్తున్నారు. భర్త విగ్నేష్ మాత్రం ఒట్టి కాళ్లతో ఉన్నారు. బ్రహ్మోత్సవాలు, స్వామి వారి ఊరేగింపులు జరిగే ప్రదేశంలో నయనతార చెప్పులతో తిరగడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో టీటీడీ అధికారులు ఆమెపై కేసు నమోదు చేయడానికి సిద్దమయ్యారట. ఆమెపై న్యాయపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో పరిశీలిస్తున్నారట. పెళ్ళై గంటలు గడవకుండానే నయనతార దంపతులు ఇలాంటి అనుకోని సమస్యలో చిక్కుకోవడం బాధాకరం.