నటి ‘షగుప్తా అలీ’ అంటే హిందీ బుల్లితెర ప్రేక్షకులు బాగా ఇష్టపడే నటి. ఎన్నో సంవత్సరాల నుండి హిందీ ప్రేక్షకుల్ని తనదైన నటనతో ఆమె ఆకట్టుకుంటూ వస్తోంది. కానీ, కాలం ఆమె పట్ల దురుసుగా ప్రవర్తించింది. కుటుంబ సభ్యులే ఆమెను మోసం చేశారు. దాంతో ఆమె ప్రస్తుతం ఆర్థికపరమైన ఇబ్బందులతో ఎన్నో కష్టాలు పడుతుంది. చివరికి తినడానికి కూడా లేక ఆమె ఇబ్బంది పడుతున్నారు.
ఇలాంటి దయనీయ పరిస్థితుల్లో ఆమెకు అనారోగ్యం సంభవించింది. అయితే వైద్య చికిత్సల కోసం ఇప్పటికే ఆమె తన బంగారు ఆభరణాలను కూడా అమ్మేసుకున్నారు. అయినా సరైన ట్రీట్మెంట్ చేయించుకోవడానికి డబ్బులు సరిపోలేదు. మరోపక్క ఆమెకు అవకాశాలు కూడా గత కొన్నేళ్లుగా రావడం లేదు. దాంతో ఆమెకు ప్రస్తుతం ఎలాంటి ఆదాయం లేదు.
అయితే తన పరిస్థితి గురించి చెప్పి, తనకు సాయం చేయమని కోరుతూ ఆమె ఇటీవల సోనూసూద్ ని కలిసింది. ఆ విషయం గురించి చెబుతూ.. ‘నేను సుమారు 30 ఏళ్లపాటు ఇండస్ట్రీలో ఉన్నాను. ఎన్నో సీరియల్స్, ఎన్నో సినిమాల్లో నటించాను. కానీ ఆ దేవుడు నా పై చిన్న చూపు చూశాడు. నేను క్యాన్సర్ బారిన పడ్డాను. ఎంతో కష్టపడి నేను రొమ్ము క్యాన్సర్ చికిత్స తీసుకున్నాను.
ఆ ట్రీట్మెంట్ కారణంగా నేను అప్పటివరకూ దాచుకున్న డబ్బు మొత్తం ఖర్చు అయిపోయింది. దీనికి తోడు నాకు ఆఫర్స్ కూడా తగ్గాయి. అయినా నిరుత్సాహ పడలేదు. అవకాశాల కోసం ఎదురు చూశాను. కానీ అంతలో డయాబెటిస్, అలాగే ఇతర ఆరోగ్య సమస్యలు నన్ను కమ్మేశాయి. చికిత్స కోసం ఉన్న బంగారు ఆభరణాలనే కాదు, చివరకు కారు కూడా అమ్మేసుకున్నాను.
ఈ క్రమంలో ఆర్థిక సాయం కోరుతూ నేను సోనూసూద్ ని కలవడం జరిగింది. కానీ, సోనూ మాత్రం నాకు ఆర్థిక సాయం చేయలేదు అని షగుప్తా బాధగా చెప్పుకొచ్చింది. నిజమే ఆమె బాధ పడటంలో అర్ధం ఉంది. కానీ, సాయం చేయలేదని విమర్శించడం కరెక్ట్ కాదు. అయితే షగుప్తా గురించి తెలుసుకున్న కొందరు ఆమె సహ నటులు ఆమెకు సాయం చేయడానికి ముందుకు వచ్చారట.