Saif Ali Khan : సినీ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై కత్తితో దాడి జరిగింది. అతను తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని లీలావతి ఆసుపత్రిలో చేర్చారు. వివరాల్లోకి వెళితే.. సైఫ్ అలీ ఖాన్, నటి కరీనా కపూర్ ల బాంద్రా వెస్ట్ లోని ఇంట్లో గురువారం తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో భారీ దొంగతనం జరిగింది. దొంగతనం సమయంలో సైఫ్ అలీ ఖాన్ పై కత్తితో దాడి జరిగింది. అర్థరాత్రి ఇంట్లోకి చొరబడిన గుర్తుతెలియని వ్యక్తి సైఫ్ పనిమనిషితో వాగ్వాదానికి దిగాడు. సైఫ్ జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించగా దుండగుడు కత్తితో అటాక్ చేసి, పరారయ్యాడు. దీంతో ఈ నటుడికి తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ లీలావతి ఆసుపత్రిలో చేరాడని, అక్కడ చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు. అతను మొదట కత్తితో పొడిచాడా లేదా దొంగతో జరిగిన గొడవలో గాయపడ్డాడా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఈ విషయంపై ముంబై పోలీసులు, క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు చేస్తున్నాయి.
కరీనా ఎలా ఉంది?
బాంద్రా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు ప్రక్రియను ప్రారంభించారు. నిందితులను పట్టుకోవడానికి అనేక బృందాలను ఏర్పాటు చేశారు. కరీనా కపూర్, ఆమె పిల్లలు సురక్షితంగా ఉన్నారు. ఈ సంఘటనపై కుటుంబం ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ప్రాథమిక దర్యాప్తు తర్వాత, పోలీసులు త్వరలో కేసుకు సంబంధించిన వివరాలను పంచుకునే అవకాశం ఉంది. ఇంటి చుట్టూ ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు.
సంఘటన సమయంలో నిద్రపోతున్న సైఫ్
ఈ సంఘటన జరిగిన సమయంలో సైఫ్ అలీ ఖాన్ తన భార్య కరీనా, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో నిద్రిస్తున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దొంగ ఇంట్లోకి ప్రవేశించి సైఫ్ అలీ ఖాన్‌ను పొడిచి పారిపోయాడు. కుటుంబ సభ్యులు మేల్కొన్నప్పుడు దొంగ అక్కడి నుండి పారిపోతూ కనిపించాడు. పోలీసులు ఇప్పుడు అతని కోసం వెతుకుతున్నారు.
డాక్టర్ ప్రకటన
లీలావతి హాస్పిటల్ సిఓఓ డాక్టర్ నీరజ్ మాట్లాడుతూ… సైఫ్ పై అతని ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడని అన్నారు. ఈ దాడిలో సైఫ్ గాయపడ్డాడు. అతన్ని తెల్లవారుజామున 3:30 గంటలకు లీలావతి ఆసుపత్రికి తీసుకువచ్చారు. అతనికి ఆరు చోట్ల గాయాలు అయ్యాయి. వాటిలో రెండు తీవ్రమైనవి. అతని వెన్నెముక దగ్గర ఒక గాయం అయింది. అతనికి న్యూరో సర్జన్ నితిన్ డాంగే, కాస్మెటిక్ సర్జన్ లీనా జైన్, అనస్థీషియాలజిస్ట్ నిషా గాంధీ ఆపరేషన్లు చేస్తున్నారు. ఆపరేషన్ తర్వాతే సైఫ్ పరిస్థితి ఏమిటో తెలుస్తుందన్నారు.