సిఎఎ, ఎన్‌ఆర్‌సి, జెఎన్‌యు-జామియా హింస తదితర అంశాలపై ముంబై చిత్ర పరిశ్రమ చాలా వేడెక్కింది. ఈ నేపధ్యంలోనే సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా మరో నటుడు అనుపమ్ ఖేర్‌ను ‘జోకర్’ అని అభివర్ణించారు. దీనికి ప్రతిస్పందనగా అనుపమ్ ఖేర్ తన సహనటుడు షా ని నిరాశపరిచిన నటుడిగా పేర్కొన్నారు. నసీరుద్దీన్ షా- అనుపమ్ ఖేర్‌ల మధ్య వివాదం ప్రభుత్వం ఇటీవల తీసుకున్న కొన్ని నిర్ణయాలు కారణంగా చోటుచేసుకుంది. సిఎఎ, ఎన్‌ఆర్‌సిలను నసీరుద్దీన్ షా వ్యతిరేకిస్తుండగా, అనుపమ్ ఖేర్ వాటికి మద్దతు ఇస్తున్నారు
బాలీవుడ్ చరిత్రలో మొదటిసారిగా పరిశ్రమలోని కొంతమంది, మరికొందరిపై ఈ విషయమై పదునైన వ్యాఖ్యలు చేస్తున్నారు. దింతో చిత్ర పరిశ్రమ ప్రభుత్వ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా మారిపోయినట్లు కనిపిస్తోంది. ఇదే కోవలో నసీరుద్దీన్ షా మాత్రమే కాకుండా, అనురాగ్ కశ్యప్, విశాల్ భరద్వాజ్, అనుభవ్ సిన్హా, దీపికా పదుకొనే, ఫర్హాన్ అక్తర్, సుశాంత్ సింగ్, స్వరా భాస్కర్, అనురాగ్ బసు తదితరులు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మరోవైపు అనుపమ్ ఖేర్, కంగనా రనౌత్, పరేష్ రావల్, వివేక్ ఒబెరాయ్, ప్రసూన్ జోషి, మాధుర్ భండార్కర్, వివేక్ మొదలైన వారంతా ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్నారు. హీరోలు అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ లు ప్రభుత్వానికి సన్నిహితం గా మెలుగుతుంటారని అందరు అనుకుంటారు. అయితే ఇప్పుడు వారితో సంబంధం ఉన్న వ్యక్తులు రాజకీయ క్రియాశీలత నుంచి తప్పుకుంటున్నారు. 2014 ఎన్నికల సమయంలో 60 మంది సినీ ప్రముఖులు లౌకిక పార్టీలకు ఓటు వేయమని ప్రజలను కోరుతూ సంతకాల ప్రచారం చేశారు. దీనిపై చాలా మంది కళాకారులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
మోడీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో బాలీవుడ్‌లో చీలిక మరింత పెరిగింది. నటుడు అనుపమ్ ఖేర్, గాయకుడు అభిజీత్ ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడారు. అధికార పార్టీకి చెందిన ప్రతి కదలికకు మద్దతు పలికారు. 2019 ఎన్నికల్లో పలువురు బాలీవుడ్ ప్రముఖులు ప్రధాని నరేంద్ర మోడీకి అనుకూలంగా ఓట్లను అభ్యర్ధించారు. నిజానికి కళ, సాహిత్యం అనేవి అధికార ధోరణికి వ్యతిరేకమని అంటుంటారు. అయితే హాలీవుడ్‌లోను ఇటువంటి భిన్న ధోరణి కనిపిస్తుంది. అక్కడ రాబర్ట్ డి నిరో, మెరిల్ స్ట్రీప్ వంటి సూపర్ స్టార్స్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను బహిరంగంగా విమర్శించారు. అయితే ఇప్పుడు బాలీవుడ్‌లో తలెత్తిన చీలిక అసాధారణమైనది. ఇప్పుడిది ఎక్కడికి దారి తీస్తుందో వేచిచూడాలి.