ప్రముఖ నిర్మాత కుమారుడిగా, మెగా ఫ్యామిలీ నటవారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు అల్లు అర్జున్. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన గంగోత్రి సినిమా ద్వారా తెరంగేట్రం చేశాడు బన్నీ. మొదటి చిత్రంతోనే పాస్ మార్కులు వేయించుకున్న బన్నీ.. రెండో చిత్రం ఆర్యతో అద్భుతమైన మేకోవర్ సాధించడంతోపాటు ఘనవిజయాన్ని సొంతం చేసుకోవడంతో స్టార్ జాబితాలోకి చేరిపోయాడు.
ఆ తర్వాత దేశముదురు, జులాయి, రేసుగుర్రం, అలవైకుంఠపురములో.. వంటి ఎన్నో హిట్ చిత్రాలతో తనదైన స్టార్‌డమ్ క్రియేట్ చేసుకున్నాడు బన్నీ. ఆయన నటించిన చిత్రాలన్నీ దేనికదే ప్రత్యేకంగా నిలుస్తాయి. మాస్, క్లాస్ అనే తేడాలేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులనూ తనదైన నటనతో అలరిస్తూ వచ్చాడు. స్టైలిష్ స్టార్ గా ఇండస్ట్రీలో ముద్రవేశాడు. కేవలం తెలుగులోనే కాకుండా.. మలయాళం వంటి ఇండస్ట్రీల్లోనూ బన్నీకి భారీగా అభిమానులు ఉన్నారు. అల్లు అర్జున్ సినిమా వచ్చిందంటే.. అక్కడ పండగ చేసేస్తారు.
అయితే..కేవలం నటనపరంగానే కాకుండా.. తనదైన స్టైల్ ను ఆడియన్స్ కు పరిచయం చేస్తూ, స్టైలిష్ స్టార్ గా ఎదిగాడు బన్నీ. ప్రతీ సినిమాకు తనను తాను కొత్తగా మలుచుకుంటూ, సరికొత్తగా ఆవిష్కరించుకుంటూ ఐకానిక్ స్టార్ గా మారిపోయాడు. సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టైల్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచాడు బన్నీ.
ఇక, అల్లు అర్జున్ ను ప్రత్యేకంగా నిలిపే కేటగిరీల్లో డ్యాన్స్ ప్రథమ స్థానంలో ఉంటుంది. ఎలాంటి స్టెప్పులైనా అలవోకగా వేసే బన్నీ.. నిరంతరం సరికొత్త డ్యాన్స్ ను పరిచయం చేసేందుకు ప్రయత్నిస్తుంటాడు. టాలీవుడ్‌లో టాప్ డ్యాన్సర్స్ లిస్టు తీస్తే.. తప్పకుండా అందులో బన్నీ పేరు ఉంటుందంటే అతిశయోక్తి కాదు. మొదటి సినిమా నుంచి ఇప్పటి దాకా ప్రతీ సినిమాలోనూ తనదైన డ్యాన్స్ తో అభిమానులను ఉర్రూతలూగిస్తుంటాడు బన్నీ.
ఇప్పటికి బన్నీ ఇండస్ట్రీలోకి వచ్చి 18 సంవత్సరాలు గడిచాయి. మొదటి సినిమా నుంచి ఇప్పటి దాకా తనను ఎన్నో విధాలుగా మలుచుకుంటూ.. అప్డేట్ చేసుకుంటూ వస్తున్నాడు. అభిమానులను అలరించేందుకు నిత్యం శ్రమిస్తుంటాడు. అందుకే.. టాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ చెప్పే మాట.. ‘బన్నీ చాలా కష్టపడుతుంటాడు’ అని. ఇవాళ అల్లు అర్జున్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా.. తెలుగు సినీ పరిశ్రమలో ఆయన మరెంతో ఎత్తుకు ఎదగాలని ఆశిద్దాం. ‘ఓకే తెలుగు’ తరపున మనం కూడా అల్లు అర్జున్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం. హ్యాపీ బర్త్ డే బన్నీ.