Pallavi Prashanth
Pallavi Prashanth: బిగ్ బాస్ తెలుగు 7 టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కి కోర్టులో ఊరట లభించింది. అతనికి బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్ 17న బిగ్ బాస్ తెలుగు 7 గ్రాండ్ ఫినాలే ముగిసింది. టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అంటూ ఒక రోజు ముందే సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అయ్యింది. అమర్ దీప్ కూడా టైటిల్ రేసులో ఉన్నాడు. పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ ఫ్యాన్స్ భారీగా అన్నపూర్ణ స్టూడియోకి చేరుకున్నారు.
ప్రశాంత్, అమర్ దీప్ ఫ్యాన్స్ మధ్య గొడవలు జరిగాయి. కొట్లాటల వరకూ వ్యవహారం వెళ్ళింది. బయట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ని పోలీసులు అన్నపూర్ణ స్టూడియో వెనుక గేటు నుండి బయటకు పంపారు. లా అండ్ ఆర్డర్ సమస్య ఉంది. ఎలాంటి ర్యాలీలు చేయకూడదని సూచించారు. పోలీసుల సూచనలు పట్టించుకోకుండా పల్లవి ప్రశాంత్ ఓపెన్ టాప్ కారులో అన్నపూర్ణ స్టూడియో ముందుకు వచ్చాడు.
పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ రెచ్చిపోగా కంటెస్టెంట్స్ కార్లు, ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు, పోలీసుల వాహనాలు డ్యామేజ్ అయ్యాయి. పల్లవి ప్రశాంత్ పై సీరియస్ అయిన పోలీసులు పలు సెక్షన్ల క్రింద కేసులు పెట్టారు. బుధవారం రాత్రి స్వగ్రామంలో అరెస్ట్ చేశారు. 14 రోజుల రిమాండ్ విధించి చంచల్ గూడ జైలుకు తరలించారు. పల్లవి ప్రశాంత్ అరెస్ట్ ని పలువురు ఖండించారు. ఫ్యాన్స్ చేసిన గొడవలకు అతన్ని బాధ్యుణ్ణి చేయడం సరికాదు అన్నారు.
పల్లవి ప్రశాంత్ బెయిల్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయన లాయర్లు నాంపల్లి కోర్టులో బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. కాగా నేడు పల్లవి ప్రశాంత్ కి బెయిల్ మంజూరు చేసింది కోర్టు. అయితే షరతులతో కూడిన బెయిల్ ఇచ్చారు. పల్లవి ప్రశాంత్ కి కోర్ట్ విధించిన షరతులు ఏంటని తెలియాల్సి ఉంది. ఎట్టకేలకు పల్లవి ప్రశాంత్ బయటకు వస్తున్నాడు.