Bigg Boss 9 telugu Grand Launch Promo: ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఆతృతగా ఎదురు చూస్తున్న ‘బిగ్ బాస్ 9′(Bigg Boss 9 Telugu) నేడు సాయంత్రం 7 గంటల నుండి గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ ద్వారా మొదలు కానుంది. సామాన్యులకు మరియు సెలబ్రిటీలకు మధ్య ఈ సీజన్ లో భారీ పోరు ఉండబోతుంది అనేది మన అందరికీ ఇది వరకే తెలుసు. ‘అగ్ని పరీక్ష’ షో ద్వారా 5 మంది హౌస్ లోకి వెళ్లిపోయారు. నిన్న గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ జరగ్గా, 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోపలకు వెళ్లిపోయారు. వారిలో 5 మంది అగ్నిపరీక్ష ద్వారా ఎంపిక కాబడిన సామాన్యులు ఉన్నారు. మర్యాద మనీష్, ఆర్మీ పవన్ కళ్యాణ్, మాస్క్ మ్యాన్ హరీష్, దమ్ము శ్రీజా మరియు ప్రియా శెట్టి హౌస్ లోపలకు అడుగుపెట్టారు. అయితే కాసేపటి క్రితమే గ్రాండ్ లాంచ్ కి సంబంధించిన ప్రోమో ని విడుదల చేశారు.
ఈ ప్రోమో చూసిన తర్వాత మొదటి బంతికే సిక్సర్ కొట్టినట్టుగా అనిపించింది. బిగ్ బాస్ హౌస్ కూడా చూసేందుకు చాలా అందంగా అనిపించింది. ఇంత అద్భుతమైన సెట్స్ గత సీజన్స్ లో కూడా లేవు అనొచ్చు. బిగ్ బాస్ హౌస్ కి సంబంధించిన హోమ్ టూర్ ని పాత సీజన్ కంటెస్టెంట్స్ అయినటువంటి అమర్ దీప్,విష్ణు ప్రియా మరియు ప్రియాంక జైన్ తో చేయించారు. ఈ హోమ్ టూర్ ని కూడా నేడు టెలికాస్ట్ చేయబోతున్నారు. ఇకపోతే కాసేపటి క్రితమే విడుదల చేసిన ప్రోమో లో నాగార్జున అగ్నిపరీక్ష కంటెస్టెంట్స్ తో చాలా సరదాగా మాట్లాడడం ఆడియన్స్ ని ప్రత్యేకంగా ఆకర్షించింది. పెద్ద స్టార్ హీరో అనే గర్వం లేకుండా తన స్నేహితులతో ఎలా అయితే మాట్లాడుతాడో, అలా మాట్లాడాడు నాగార్జున. ఆయనలోని ఈ తత్వమే అందరికీ తెగ నచ్చేస్తుంది.
ప్రోమో ప్రారంభం లో చిరంజీవి మిమిక్రీ వాయిస్ తో మాట్లాడింది ఎవరో కాదు, జబర్దస్త్ ఇమ్మానుయేల్. అదే విధంగా అనుకుంటే సాధించేవరకు నిద్రపోను అన్న కంటెస్టెంట్ తనూజ అయ్యుండొచ్చు. ‘పిక్చర్ అభీ బాకీ హై’ అని ఒక కంటెస్టెంట్ అంటుంది. అప్పుడు నాగార్జున దానికి అబ్బా, చూద్దాం లోపల ఏమి చేస్తావో అని అంటాడు. ఆ కంటెస్టెంట్ ఎవరో కాదు, బుజ్జిగాడు ఫేమ్ సంజన గల్రాని. ముందే సెలబ్రిటీ కంటెస్టెంట్స్ అందరి పేర్లు సోషల్ మీడియా లో లీక్ అవ్వడం వల్ల పెద్ద థ్రిల్లింగ్ అనిపించలేదు. ప్రోమో చూస్తేనే ఎవరెవరో చాలా తేలికగా కనిపెట్టేస్తున్నారు నెటిజెన్స్. కానీ సెటప్ మాత్రం అదిరింది. మొదటి రోజు నుండే అద్భుతమైన కంటెంట్ వచ్చేలా అనిపిస్తుంది. చూడాలి మరి ఈ సీజన్ ఎలా ఉండబోతుంది అనేది.