Bigg Boss 5 Telugu : తెలుగు బుల్లితెర చరిత్రలో బిగ్ బాస్ క్రేజ్ ఏంటన్నది అందరికీ తెలిసిందే. నిజానికి ఇది ఒక ఇంగ్లీష్ షో. ‘బిగ్ బ్రదర్’ పేరుతో అక్కడ హిట్ కొట్టిన ఈ షో.. ఆ తర్వాత మనదేశంలో మొదటగా హిందీలో మొదలైంది. ఇక్కడ కూడా సక్సెస్ కావడంతో.. ఆ తర్వాత ఇతర భాషలకూ విస్తరించింది. ఈ క్రమంలో.. తెలుగు బిగ్ బాస్ షో మొదటి సీజన్ 2017లో మొదలైంది. అయితే.. ఆరంభం వరకూ అందరిలో ఒక సందేహం ఉండేది. ఈ షో తెలుగులో సక్సెస్ అవుతుందా? ఆడియన్స్ ఓన్ చేసుకుంటారా? అనే టెన్షన్ నిర్వాహకుల్లో ఉండేది. కానీ.. ఫస్ట్ సీజన్ అద్దిరిపోయే రెస్పాన్స్ అందుకుంది. ఇందులో.. కంటిస్టెంట్స్ షేర్ ఒకెత్తయితే, హోస్టు షేర్ మరో ఎత్తు.
అప్పటి వరకూ బిగ్ బాస్ షో అంటే తెలుగువారికి తెలియదు. అప్పటి వరకూ హీరోగా తప్ప, ఎన్టీఆర్ హోస్టింగ్ ఎలా ఉంటుందనేది కూడా ఎవ్వరికీ తెలియదు. కానీ.. సీన్ కట్ చేస్తే అటు బిగ్ బాస్ షో తోపాటు.. ఎన్టీఆర్ హోస్టింగ్ కూడా సూపర్ సక్సెస్ అందుకున్నాయి. మరి, మొదటి సీజన్ కు జూనియర్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడు? అంటే.. ఎపిసోడ్ కు 40 లక్షల చొప్పున తీసుకున్నాడు. మొత్తంగా 8 కోట్ల మేర పారితోషికం అందుకున్నాడు జూనియర్.
ఆ తర్వాత రెండో సీజన్ కు నేచురల్ స్టార్ హోస్టింగ్ పగ్గాలు అందుకున్నాడు. జూనియర్ తో కంపేరింగ్ చేస్తూ.. నాని ఎలా రన్ చేస్తాడో అని అనుకున్నప్పటికీ.. తనదైన మాటల మాయజాలంతో షోను సక్సెస్ ఫుల్ గా ముగించాడు. నాని కూడా ఎపిసోడ్ లెక్కనే రెమ్యునరేషన్ అందుకున్నాడు. ఈ విధంగా.. మొత్తం 3 కోట్ల రూపాయలు తీసుకున్నాడు.
ఇక, మూడో సీజన్ నుంచి బిగ్ బాస్ హోస్టుగా అలరిస్తున్నారు నాగ్. జోవియల్ గా షోను రన్ చేస్తూ మంచి మార్కులు కొట్టేస్తూ వచ్చారు నాగార్జున. కంటిస్టెంట్లను ప్రోత్సహించడం.. పొరపాట్లు చేస్తే హెచ్చరించడం వంటి పద్ధతులో షోను పర్ఫెక్ట్ గా రన్ చేస్తున్నారు. దీంతో.. షోకు మంచి రేటింగ్ వచ్చింది. మూడో సీజన్ కు ఎపిసోడ్ కు 12 లక్షల చొప్పున మూడున్నర కోట్లు తీసుకున్నారు నాగ్.
నాలుగో సీజన్ కు వచ్చేసరికి ఎపిసోడ్ లెక్కన కాకుండా.. గంపగుత్తగా షో మొత్తానికి రేట్ ఫిక్స్ చేశారు. దీని ప్రకారం 7 కోట్లు తీసుకున్నారు నాగార్జున. అయితే.. ఇది జూనియర్ ఎన్టీఆర్ తీసుకున్న మొత్తానికి తక్కువే. దీంతో.. ఇప్పుడు ఐదో సీజన్లో ఎంత తీసుకుంటున్నారు? అనే ఆసక్తి నెలకొంది. అందుతున్న సమాచారం ప్రకారం.. ఐదో సీజన్ లో జూనియర్ రెమ్యునరేషన్ ను క్రాస్ చేశాడు నాగార్జున.
ఈ సీజన్ కు 9 కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడట నాగ్. అంతేకాదు.. మరో విధంగా డబ్బులు వచ్చిపడుతున్నాయి. బిగ్ బాస్ సెట్ ను అన్నపూర్ణ స్టూడియోస్ లోనే నిర్మించారు. రెండో సీజన్ నుంచి ఇక్కడే నడిపిస్తున్నారు. కాబట్టి.. ఇటు భారీగా హౌస్ రెంట్ కూడా వచ్చేస్తోంది. ఇలా.. రెండు విధాలుగా ఆర్జిస్తున్నారు నాగ్.