Pawan Kalyan: భీమ్.. భీమ్.. భీమ్.. భీమ్.. భీమ్లానాయక్.. బుర్ర రాంకీర్తన పాడించే.. అంటూ ఎక్కడ చూసినా భీమ్లా కీర్తన పదే పదే చెవులను హోరెత్తిస్తుంది. అందుకే భీమ్లానాయక్ రీమేక్ పై విశ్లేషణ కావాలంటూ తెలుగు ప్రేక్షక బుర్రలు కూడా గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పదే పదే కోరుతున్నాయి. సరే మ్యాటర్ లోకి వెళ్తే.. మళయాళంలో వచ్చిన అయ్యప్పానుమ్ కోషియుమ్ సినిమాను తిరిగి తెలుగులో భీమ్లా నాయక్ పేరుతో పునర్నిర్మిస్తున్నారు. బాగానే ఉంది. కానీ కేరళీయుల సినిమాలో ఒక వ్యక్తి హీరోయిజాన్ని ఎత్తిచూపరు.

వచ్చేస్తున్నాడు హీరో, కాదు కాదు మా దేవుడు వంటి దిక్కుమాలిన రొటీన్ కీర్తనలు మలయాళ సినీ బాగోతాల్లో ఎక్కడ మచ్చుకు అయిన కనబడవు. అలాగే భీమ్.. భీమ్.. భీమ్… భీమ్లానాయక్… దంచి దడదడదడలాడించే డ్యూటీ సేవక్ అంటూ పవన్ పాత్ర పై ఇస్తోన్న భారీ బిల్డప్ సాంగ్స్ కూడా అయ్యప్పానుమ్ కోషియుమ్ లో అసలీ లేనే లేవు.
అసలు తెలుగు స్టార్ హీరో అనగానే.. ఆత్రార్భాటపు సాహిత్యం ఎందుకు ? అయ్యప్పానుమ్ కోషియమ్ లాంటి గొప్ప కథలో అనవసరమైన హీరోయిజాలు, రెగ్యులర్ మాస్ బీట్స్ అవసరమా ? ఇలాంటి వాటి కారణంగానే తెలుగు సినిమా ప్రేమికులలో నిస్సత్తువ, నీరసం ఆవహిస్తున్నాయి. అసలు మనం ముందు అయ్యప్పానుమ్ కోషియమ్ సినిమా గురించి ఓ రెండు ముక్కలు ముచ్చటించుకోవాలి.
ఆ సినిమా కేరళ సినిమా కావొచ్చు. కేవలం రూ.5 కోట్లు పెట్టి మాత్రమే తీసి ఉండొచ్చు. కానీ రూ.52 కోట్లు వరకు కేరళలో ఆ సినిమా కలెక్ట్ చేసింది. ఆ సినిమా ఇంత గొప్ప విజయాన్ని ఎందుకు అందుకుంది అని ఆలోచిస్తే.. కథలో ఎక్కడా పరిధి దాటలేదు. అలాగే హీరోయిజమ్ కోసం పాత్రలోని పెయిన్ ను ఎక్కడా డైవర్ట్ చేయలేదు.
అందుకే ఆ అయ్యప్పానుమ్ కోషియుమ్ బంపర్ హిట్ అయింది. పైగా ఆ సినిమాలో కోషి పాత్రలో నటించిన పృథ్విరాజ్ సుకుమారన్, ఎస్ ఐ అయ్యప్పన్ పాత్ర వేసిన బిజూ మీనన్ మధ్య బలమైన పోటీ ఉంటుంది. రెండు పాత్రలకు సమాన ఇంపార్టెన్స్ ఉంటుంది. మరి తెలుగులో ఆ అవకాశం ఉందా ? ఇప్పటికే పవన్ ముందు రానా తేలిపోయాడు ?
ఇక సినిమా వచ్చే నాటికి పూర్తిగా పవనే కనిపిస్తాడేమో. ఒక్కటి మాత్రం స్పష్టం. పవన్ మాత్రమే హైలైట్ అయితే ఇక హిట్ అవ్వడం కష్టమే !