Bhagwant Kesari story : మరో మూడు రోజుల్లో భగవంత్ కేసరి థియేటర్స్ లోకి రానుంది. చిత్ర యూనిట్ గట్టిగా ప్రొమోషన్స్ నిర్వహిస్తున్నారు. బాలయ్య గత రెండు చిత్రాలు మంచి విజయాలు సాధించిన నేపథ్యంలో భగవంత్ కేసరిపై అంచనాలు ఏర్పడ్డాయి. ట్రైలర్ సైతం ఆకట్టుకుంది. కాగా భగవంత్ కేసరి చిత్ర కథ ఇదే అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దాని ప్రకారం బాలయ్య పాత చిత్రాన్ని అది తలపిస్తుంది. మరి ఆ కథ ఏమిటో పరిశీలిస్తే….
భార్య కాజల్, కూతురు వరసైన శ్రీలలతో కూడిన అందమైన ఫ్యామిలీ భగవంత్ కేసరిది. శ్రీలీలను చాలా పద్దతిగా పెంచుతాడు బాలకృష్ణ. ఆమెకంటూ కొన్ని లక్ష్యాలు సెట్ చేస్తాడు. ఆ లక్ష్యాల సాధనే ధ్యేయంగా ఆమెను పెంచి పెద్ద చేస్తాడు. అనుకోకుండా శ్రీలీల కారణంగా విలన్ అర్జున్ రామ్ పాల్ తో భగవంత్ కేసరికి తేడా వస్తుంది. వీరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది. సామాన్యుడైన భగవంత్ కేసరి కార్పొరేట్ కింగ్ రామ్ పాల్ దెబ్బకు జైలు పాలు అవుతాడు.
చేయని తప్పుకు భగవంత్ కేసరి ఏళ్ల తరబడి జైల్లో గడుపుతాడు. బయటకు వచ్చిన బాలకృష్ణ తన ప్రతీకారం తీర్చుకునేందుకు సింగిల్ గా బయలుదేరుతాడు. వృద్దుడిగా ఉన్న బాలయ్య గెటప్ ని ట్రైలర్ లో చూపించలేదు. అదే సిల్వర్ స్క్రీన్ పై సర్ప్రైజ్ అంటున్నారు. ఈ వార్తల్లో నిజం ఉంటే… ఇది చెన్నకేశవరెడ్డి చిత్ర కథను తలపిస్తుంది. ఆ చిత్రంలో కూడా తీహార్ జైల్లో రెండు దశాబ్దాలకు పైగా మగ్గిపోయిన బాలకృష్ణ అందుకు కారణమైన వాళ్ళను ఒక్కొక్కరిగా చంపేస్తాడు.
అయితే కొన్ని తేడాలు ఉన్నాయి. అందులో రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యం కాగా భగవంత్ కేసరి చిత్రంలో తెలంగాణా ప్రాంతానికి చెందిన సెంటిమెంట్ స్టోరీ. చెన్నకేశవ రెడ్డి సూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. భగవంత్ కేసరి దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదల కానుంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్. థమన్ సంగీతం అందిస్తున్నారు. దసరా బరిలో లియో, టైగర్ నాగేశ్వరరావు వంటి రెండు భారీ చిత్రాలు దిగుతున్నాయి. వాటి నుండి భగవంత్ కేసరికి తీవ్ర పోటీ ఉంది.