Sankranthi Cinemas: సంక్రాంతి పండుగ అంటేనే తెలుగు లోగిళ్లు ముగ్గులతో ముచ్చట గొలుపుతాయి. కొత్త అల్లుల్లు, అత్త గారింట్లో సందడిలు.. గ్రామాల్లో కోలాహలాలు ఉంటాయి. సంక్రాంతి అనేది పంటల పండుగ. ఇది దక్షిణ భారతదేశంలో ప్రముఖంగా జరుపుకుంటారు. తెలుగు ప్రజలకు సంక్రాంతి ఎప్పుడూ ఉల్లాసాన్ని పంచుతుంది. అదే క్రమంలోనే సెలవులు ఎక్కువగా ఉండడంతో వినోదం కూడా దీనికి ఎక్కువగా ఉంటుంది.
ఈ పండుగ సందర్భంగా విడుదలయ్యే తెలుగు సినిమాలు మిగతా సినిమాల కంటే ఎక్కువ దృష్టిని ఆకర్షిస్తాయి. ప్రభాస్, పూజా హెగ్డే నటించిన ‘రాధేశ్యామ్’, పవన్ కళ్యాణ్-రానా దగ్గుబాటి నటించిన ‘భీమ్లా నాయక్’, ఇక ప్యాన్ ఇండియా మూవీ ఎన్టీఆర్-రాంచరణ్ లు నటిస్తున్న రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ వంటి భారీ చిత్రాలు సంక్రాంతి సందర్భంగా విడుదలకు రెడీ అయ్యాయి. దీంతో ఈ సంక్రాంతికి తెలుగు ప్రజలకు భారీ బోనాంజ దక్కబోతోంది. సినిమాల వ్యాపారం, కలెక్షన్లు జోరుగా జరుగనున్నాయి. ఇక ‘ఆర్ఆర్ఆర్’తో పోటీ వద్దని మహేష్ బాబు తన చిత్రం ‘సర్కారు వారి పాట’ను ఏప్రిల్ కు వాయిదా వేశాడు.
ఈ సంక్రాంతికి భారీ సినిమాలు విడుదల అవుతుండడంతో సినీ ప్రియులు రెడీ అవుతున్నారు. సంక్రాంతి సందర్భంగా కోడి పందాలతోపాటు ఈ సినిమా కలెక్షన్లపై కూడా భారీగా బెట్టింగులు ప్రారంభించినట్టు సమాచారం. ఈ సంక్రాంతికి భారీ పోటీ ఉండడంతో ఏవైనా చిత్రాలు వాయిదా పడవచ్చని వారిలో కొందరు భావిస్తున్నారు. అందుకే అభిమానులు అప్ డేట్ ల కోసం ఎదురుచూస్తున్నారు.
సంక్రాంతికి థియేటర్లలో సినిమాలను చూడడానికి ఇష్టపడే ప్రేక్షకులు చాలా మంది థియేటర్లకు పోటెత్తుతారు. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతికి దాదాపు 10రోజులు సెలవులు ఇస్తారు. దీంతో ఈ రోజులు అంతా కోడి పందాలు, సినిమాలు, ఇతర ఎంజాయ్ మెంట్ కు కేటాయిస్తారు. అందుకే నిర్మాతలు కూడా తమ సినిమాలను ఎన్ని సినిమాలున్నా సంక్రాంతికి విడుదల చేయడానికి పోటీపడుతారు. విడుదల తేదీ స్లాట్ బుక్ చేసుకోవడానికి నిర్మాతల మధ్య గట్టి పోటీ ఉండనుంది.
నిజానికి సాధారణ పండుగలు, ఇతర తేదీల కంటే సంక్రాంతి సీజన్ లో సినిమాల ద్వారా వచ్చే ఆదాయం చాలా ఎక్కువ. సినిమాలే కాకుండా కోడిపందాలు, సామూహిక వేడుకలకు సంక్రాంతి ప్రసిద్ధి చెందింది. సో ఈ సంక్రాంతికి సినిమాలకు కలెక్షన్లు, వాటిపై జోరుగా బెట్టింగులు కాయడం ఖాయంగా కనిపిస్తోంది.