Life Of Pi: లైఫ్ ఆఫ్ పై.. 2012లో విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనాన్ని సృష్టించింది.. 2001లో యాన్ మార్టెల్ అనే రచయిత రాసిన నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాకు ఆంగ్ లీ(Ang Lee) దర్శకత్వం వహించారు. ఓ యువకుడు ఒక పులితో పసిఫిక్ సముద్రం మీదుగా పడవలో చేసే ప్రయాణమే ఈ సినిమా కథ.. ఈ సినిమా ద్వారా దర్శకుడు అనేక కోణాలను టచ్ చేసాడు. హిందుత్వాన్ని, క్రిస్టియానిటీని, ఇస్లాంను ఇలా అన్ని మతాలనూ స్పృశించాడు. ఆదిల్ హుస్సేన్ ఈ సినిమాలో కీలకపాత్ర పోషించాడు. అతడు నటించిన విధానం ఈ సినిమాకు హైలెట్.

ఈ సినిమా చూస్తున్నంత సేపు పసిఫిక్ సముద్రంలో ఆదిల్ హుస్సేన్ పులి నుంచి తనను తాను కాపాడుకునే విధానం రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తుంది. ఆ దృశ్యాలు చూస్తుంటే అవి నిజమేనేమో అని భ్రమ కలుగుతుంది. పసిఫిక్ మహాసముద్రంలోనే సినిమా షూటింగ్ మొత్తం చేశారేమో అనిపిస్తుంది.. తెల్లని వన్నీ పాలు కావు, నల్లని వన్నీ నీళ్లు కావు అన్నట్టుగా.. ఆదిల్ హుస్సేన్ పులితో నటించిన సీన్లు మొత్తం నిజం కావు.
గ్రాఫిక్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత దాన్ని ఆధారంగా ఈ సినిమాను మరింత ఉన్నతంగా రూపొందించారు. పుష్కర కాలం క్రితం ఈ సినిమా విడుదలైనప్పటికీ.. అప్పటి కాలానికి మించిన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ చిత్రాన్ని రూపొందించారు.. ఫాక్స్ కాన్ సంస్థ ఎక్కడా ఖర్చుకు వెనకాడకుండా ఈ సినిమాను నిర్మించింది. క్లాడియో మీరండా సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు ప్రధాన బలం. కెనడా, ఇండియా, మెక్సికో, జపాన్ దేశాల్లో ఈ సినిమా విడుదల అయింది. 120 మిలియన్ డాలర్ల ఖర్చుతో ఈ సినిమాను రూపొందిస్తే.. 600 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటులు టబు, సూరజ్ శర్మ, ఇర్ఫాన్ ఖాన్ వంటి వారు నటించారు. ఇక ఈ సినిమాకు సంబంధించి పసిఫిక్ మహాసముద్రంలో కనిపించే దృశ్యాలు మొత్తం గ్రాఫిక్ లో రూపొందించినవే. చివరికి ఆ పులి కూడా గ్రాఫిక్స్ ద్వారా తయారు చేసిందే. ఈ చిత్ర నిర్మాణానికి సంబంధించిన షూటింగ్ దృశ్యాలు.. ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. చుట్టూ గ్రీన్ మ్యాట్ తో.. ఆది హుస్సేన్ ఒక పడవపై ఉండగా తీసిన దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. అందుకే అంటారేమో సినిమా అనేది ఒక అందమైన అబద్ధమని..