పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్.. బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. టాలీవుడ్ చరిత్రలోనే ముందెన్నడూ లేని విధంగా కలెక్షన్లు సాధిస్తూ దూసుకెళ్తోంది. అయితే.. ఈ సినిమా ప్రభంజనాన్ని అడ్డుకునేందుకు ఉద్దేశపూర్వకంగా ప్రయత్నాలు సాగుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. రాజకీయ దురుద్దేశంతోనే ఏపీ ప్రభుత్వం వకీల్ సాబ్ ను టార్గెట్ చేసిందని అంటున్నారు.
వకీల్ సాబ్ విడుదల ముందు రోజు వరకూ సైలెంట్ గా ఉన్న ఏపీ సర్కారు.. ఉన్నఫళంగా సినిమా టిక్కెట్ల విషయం గుర్తుకు వచ్చింది. దీంతో.. రాత్రికి రాత్రే సినిమా టిక్కెట్ల ధరలు ఎంత ఉండాలో నిర్ణయిస్తూ జీవో కూడా జారీచేసింది. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కన్నా.. ఒక్క పైసా కూడా ఎక్కువ తీసుకోవద్దంటూ ఆ జీవోలో ఆదేశించింది. ఈ నిర్ణయం.. వకీల్ సాబ్ మేకర్స్, డిస్ట్రిబ్యూటర్స్ తోపాటు సినిమా ఇండస్ట్రీ పెద్దలకు పెద్ద షాకే ఇచ్చింది.
సహజంగా పెద్ద హీరోల చిత్రాలు ఏవి రిలీజ్ అయినా.. బెనిఫిట్ షోలు వేయడం సర్వ సాధారణం. మొదటి వారం పాటు టికెట్ రేట్లు పెంచుకోవడం కూడా ఎప్పుడూ జరిగేదే. ఈ మేరకు ప్రభుత్వాలే జీవో ఇచ్చాయి. కానీ.. జగన్ సర్కారు ఉన్నట్టుండి రేట్లు ఇంతే ఉండాలంటూ జీవో జారీచేయడం పవన్ అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కనీసం బెనిఫిట్ షోలకు కూడా అవకాశం ఇవ్వని ప్రభుత్వం.. టికెట్ రేట్లు కూడా పెంచడానికి వీళ్లేదని ప్రకటించింది.
జగన్ సర్కారు తీరుపై పవన్ అభిమానులు, బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. వకీల్ సాబ్ ను డీఫేమ్ చేసే కుట్ర జరుగుతోందంటూ హీరోయిన్ పూనమ్ కౌర్ కూడా పోస్టు చేశారు. ఇప్పుడు తాజాగా సినీనటుడు, నిర్మాత బండ్ల గణేష్ కూడా స్పందించారు. ఏపీ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ‘వకీల్ సాబ్ తో పేస్తారా?’ అని ట్వీట్ చేసిన బండ్ల.. ‘ఏపీ ప్రభుత్వ తీరుపై సినీ పెద్దలు స్పందించరా?’ అని ప్రశ్నించాడు.
మొత్తానికి.. వకీల్ సాబ్ విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై పెద్ద దుమారమే రేగుతోంది. పవన్ సినిమాకు రాజకీయ దురుద్దేశంతోనే టార్గెట్ చేశారనే విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. దీంతో.. అందరూ సినీ పెద్దలవైపే చూస్తున్నారు. వాళ్లు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వం టికెట్ రేట్ల విషయంలో ఏకంగా జీవోనే తెచ్చిన నేపథ్యంలో.. అన్ని సినిమాలకూ ఇదే వర్తిస్తుందా? వకీల్ సాబ్ తర్వాత ఎత్తేస్తారా? అన్నది చర్చనీయాంశంగా మారింది.